బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

PSLV-C59 Rocket నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 శాటిలైట్

PSLV-C59 rocket
ISRO successfully launches PSLV-C59 rocket with European Space Agency’s Proba-3 satellites తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ59 శాటిలైట్ గురువారం  విజయవంతంగా నింగిలోకి దూసుకెల్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహకనౌక నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రోఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా-3 ఉప గ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగామన్నారు. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకు ఇస్రో ఛైర్మన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఎన్ఎస్‌ఐఎల్‌ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని పేర్కొన్నారు. పీఎస్‌ఎల్‌వీకి మరిన్ని అవకాశాలు కల్పించిన ఎన్‌ఎస్‌ఐఎల్‌కు ధన్యవాదాలు తెలిపారు. తద్వారా మరిన్ని వైవిధ్యభరితమైన ప్రయోగాలకు వీలు కలుగుతుందన్నారు. డిసెంబరులో స్పేటెక్స్‌ పేరుతో పీఎస్‌ఎల్‌వీ-సీ60 ప్రయోగం ఉంటుందని ఇస్రోఛైర్మన్‌ తెలిపారు. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్‌-1 సోలార్‌ మిషన్‌ కొనసాగుతుందన్నారు.
 
ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్‌ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని ఈఎస్‌ఏ తెలిపింది.