శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (08:34 IST)

ప్రజలకు, ప్రభుత్వానికి మేలు కొలుపుగా వార్తలుండాలి: మంత్రి బొత్స సత్యనారాయణ

‘ప్రజలకు మేలు...ప్రభుత్వానికి మేలు కొలుపు’ గా ఉండేలా జర్నలిస్టులు వార్తలు రాస్తే అందరూ హర్షిస్తారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసేట్లుగా రాయడం మంచి పరిణామం కాదని హితవు పలికారు.

జర్నలిస్టులకు తాము వాడే పదాలే పదునైన ఆయుధాలనీ, వాటిని సరైన విధంగా ప్రయోగించాలన్నారు. సమగ్రమైన సమాచారంతో, వాస్తవికతతో కూడిన వార్తలకు ఆదరణ, గుర్తింపు లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన ఈ తరగతుల్లో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత అనేది ఉంటే, వార్తాంశాలను స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు అందించగలుగుతారనీ ఆ దిశలో జర్నలిస్టు సంఘాలు చొరవ చూపాలని సూచించారు.

అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వుండేలా జర్నలిస్టుల కమిటీలను ఏర్పాటు చేసి ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఉద్యోగ భద్రతను కల్పించే దిశగా అంతా కలసి ముందుకు సాగాలంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. జర్నలిస్టులకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ప్రెస్ అకాడమీని ఇందులో పాల్గొన్న జర్నలిస్టులను అభినందించారు.  
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్‌లాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనతో పాటు ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ మెరుగైన సమాజం కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల కృషిని కొనియాడారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా కాలనుగుణంగా ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం వుందని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవటానికి దోహదపడతాయని ఆయన అన్నారు.  
 
ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, వ్యాపార,రాజకీయ,కుల, వర్గ ప్రయోజనాలకు సంబంధం లేకుండా మీడియా రంగం అభివృధ్ది చెందాల్సిన అవసరం వుందన్నారు. నైతిక విలువల్ని కోల్పోవాల్సిన పరిస్థితి రాకుండా జర్నలిస్టులు వ్యవహారించాలని కోరారు.
 
శిక్షణ తరగతుల ప్రారంభ ఉపన్యాసంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. నకిలీ జర్నలిస్టులను పూర్తి స్థాయిలో గుర్తిస్తే అసలైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను సమర్ధవంతంగా అందించే అవకాశం వుంటుందని, ఇందు కోసం జర్నలిస్టుల యూనియన్ లు దృష్టి పెట్టాలని కోరారు.

జర్నలిజంలో  మెళకువలు తెలియచేసే క్రమంలో ప్రెస్ అకాడమీ గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని అన్నారు. కరోనా నేపధ్యంలో ఏపీలో అన్ని జిల్లాల వారీగా ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ తరగుతులు ఏర్పాటు చేస్తున్నామని  తెలిపారు. 

ఈ శిక్షణ కార్యక్రమానికి సమన్వయకర్తగా విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణారెడ్డి వ్యవహారించగా, పలువురు సీనియర్ పాత్రికేయులు వివిధ అంశాలపై శిక్షణ తరగతులును నిర్వహించారు.