శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (07:37 IST)

రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: జనసేన - బీజేపీ

రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకున్న విపత్తులు... ముఖ్యంగా నివర్ తుపాన్ మూలంగా రైతాంగం అన్ని విధాలుగా నష్టపోయారు. అయినప్పటికీ వారికి తక్షణ సాయం, రైతులు కోరుతున్న పరిహారం ఇవ్వడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనబరుస్తోందని జనసేన - బీజేపీ పార్టీలు అభిప్రాయపడ్డాయి.

ఇటీవల జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ నివర్ ప్రభావిత జిల్లాల్లో చేపట్టిన పర్యటనలో రైతుల వేదన వెల్లడైందని ఇరు పార్టీలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ లో ఇరు పార్టీల ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) వి.సతీష్, బీజేపీ ఏపీ కో ఇంచార్జ్ సునీల్ దేవధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రైతుల కోసం చేపట్టిన పర్యటన గురించి చర్చించారు. 

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని పవన్ కల్యాణ్ డిమాండ్, రైతుల పంట నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. రైతుల్లో ఏర్పడుతున్న నిరాశానిస్పృహలను దూరం చేయాల్సిన కర్తవ్యం, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ అసమర్థ విధానాలు, పాలన వైఫల్యాలతో రహదారుల నిర్వహణ, నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించడం అనేది సమావేశ అజెండాలో ఒక అంశంగా ఉంది. ఛిద్రమైపోయిన రోడ్ల వల్ల సామాన్యుల రోజువారీ జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని, అత్యవసర వైద్య సేవలకు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళడం కూడా దుర్లభంగా మారిందని ఇరు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. రహదారుల దుస్థితిపై బీజేపీ చేపట్టిన ఆందోళనలను ఈ సందర్భంగా వివరించారు. 
 
ఏలూరు నగరంలో అంతుపట్టని అనారోగ్య సమస్యలతో ప్రజలు పడుతున్న ఆందోళనపై సమావేశంలో నాయకులు విచారం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత దృష్ట్యా ఏలూరుకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించి పరిస్థితిని అధ్యయనం చేయించి విచారణ చేయించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 
 
ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్లు అమలు చేయాలి
రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన జనరల్ కేటగిరీకి చెందిన ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలుపరచడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఎంతోమంది పేద యువతీయువకులు అవకాశాలు కోల్పోతున్నారని బిజెపీ, జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు.

కేంద్రం ఎంతో విశాల దృక్పథంతో తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ సవరణ అమలుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. పథకాలను అమలు చేయడంలోను, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాల అమలులో  జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఇరు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.

ఫలితంగా ఉపాధి అవకాశాలు క్షీణించాయని, ముఖ్యంగా రాయలసీమలోని యువత నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం అయింది. రాయలసీమలో వ్యవసాయం దెబ్బ తినడంతోపాటు, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇబ్బందిపడుతున్నారని గుర్తించారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకొని రానున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతోపాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం మార్గదర్శకాలను రూపొందించుకోవాలని బీజేపీ, జనసేన నాయకులు నిర్ణయించారు.