గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (18:52 IST)

జగన్‌పై వీరాభిమానే దాడి.. ఎందుకు చేశాడంటే...

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన అభిమానే దాడిచేశాడు. కోడి పందెంకు వాడే కత్తికి విషం పూసి ఈ దాడికి పాల్పడ్డాడు. వైజాగ్ విమానాశ్రయంలో ఈ దాడి జరిగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడి చేసిన జగన్ అభిమానిని అదుపులోకి తీసుకున్నాడు. 
 
ఈ దాడిపై విశాఖ వెస్ట్ జోన్ ఏసీపీ అర్జున్ స్పందిస్తూ, పాపులారిటీ కోసమే జగన్‌పై శ్రీనివాసరావు హత్యయత్నం చేశాడన్నారు వివరించారు. ప్రాథమిక దర్యాప్తులో శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని తేలిందన్నారు. శ్రీనివాసరావుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు. 
 
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఏసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేశ్ కుమార్ రిపోర్టు ద్వారా ఎయిర్‌పోర్టు సీఐకి కేసు అప్పగించారు. శ్రీనివాసరావుపై 307 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 
 
అలాగే, ఈ దాడిపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందిస్తూ, 'మధ్యాహ్నం 12 గంటలకు జగన్ వీఐపీ లాంజ్‌కు వచ్చారు. అక్కడి సర్వర్ అందరికీ టీ ఇచ్చాడు. 2.30 గంటలకు మళ్లీ కాఫీ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్‌తో సెల్ఫీ దిగాలని అడిగాడు. ఎడమ చేతితే సెల్ఫీ తీసుకుంటూనే.. కుడి చేతితో జేబులో నుంచి కత్తి తీశాడు. కత్తితో జగన్ ఎడమ భుజంపై దాడి చేశాడు. అక్కడున్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్‌కుమార్‌తో పాటు జగన్ గన్‌మెన్‌లు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. 
 
ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. జగన్‌కు ఫస్ట్‌ఎయిడ్ చేశాక విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు అని ఆయన వివరించారు. జగన్‌పై దాడి చేసిన వ్యక్తి ముమ్మిడివరం మండలం తానాయలంకకు చెందిన జానేపల్లి శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావు జేబులో పది పేజీల లేఖ ఉన్నట్లు గుర్తించారు. 
 
దాడికి కారణాలేంటో విచారిస్తాం. ఎయిర్ పోర్టులో ఘటన జరిగింది కాబట్టి సీఐఎస్ఎఫ్ అధికారులే పూర్తి బాధ్యత తీసుకోవాలి. భారీ భద్రత ఉండే ఎయిర్‌పోర్టు లోపలకు కత్తి ఎలా వెళ్లిందో సీఐఎస్ఎఫ్ వారిని అడుగుతున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికీ మేం రక్షణ కల్పిస్తున్నాం. జగన్ కోరితే మరింత భద్రత పెంచుతాం' అని డీజీపీ వివరించారు.
 
ఇదిలావుండగా, జగన్‌కు శ్రీనివాస్ వీరాభిమాని అని అతను పని చేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ తెలిపారు. అతనికి ఎలాంటి క్రిమినల్ బ్యాంక్ గ్రౌండ్ లేదన్నాడు. మానసికంగా బాగానే ఉన్నాడని.. ఎవరో కుట్రపూరితంగా దాడి చేయించారనిపిస్తోందన్నారు. తమ రెస్టారెంట్‌లో కనీసం ఫోన్‌ను కూడా అనుమతించమని హర్షవర్థన్ తెలిపాడు. 
 
జగన్ వీరాభిమాని అనడానికి రుజువుగా ఈ ఏడాది న్యూఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా తయారు చేయించిన ఫ్లెక్సీ ఒకటి వైరల్ అవుతోంది. దానిలో జగన్‌తో పాటు శ్రీనివాసరావు ఫొటోలు ఉన్నాయి. చంటి అనే పేరు ఫ్లెక్సీలో ఉంది. తను, జగన్‌ల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఫ్లెక్సీ రూపొందించారు. అయితే దీనిలో ఎంత వరకు నిజానిజాలున్నాయో తెలియాల్సి ఉంది.