జగన్‌పై దాడి.. ముందే చెప్పిన హీరో శివాజీ.. ఖండించిన పవన్
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ వెళ్లేందుకు వైజాగ్ విమానాశ్రయ లాంజ్‌లో వేచివున్న జగన్‌పై వెయిటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కత్తితో భుజంపై పొడిచిన సంగతి తెలిసిందే. దాడి అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలో అధికార పార్టీని నిర్వీర్యం జరిగేందుకు భారీ కుట్ర జరగబోతోందని... రాష్ట్రంలోని రెండు కీలక పార్టీల అధినేతలు వారికి తెలియకుండా కుట్రలో భాగస్వాములు అవుతారని హీరో శివాజీ గతంలో చెప్పారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతపై దాడి కూడా జరుగుతుందని ఆయన తెలిపారు.
ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. ప్రతిపక్ష నేతపై దాడి తర్వాత రాష్ట్రంలో అలజడులు చెలరేగుతాయని... వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని తెలిపారు.
ఇదిలా ఉంటే.. వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్‌పై దాడిని జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తుందని అన్నారు.
ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు. ఈ దాడిని తీవ్రమైందిగా తమ పార్టీ భావిస్తోందని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, గాయం నుంచి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ కోరారు.