మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (17:13 IST)

దేవుడి దయ వల్ల నేను క్షేమంగానే ఉన్నా : వైఎస్ జగన్

దేవుడి దయ వల్ల నేను క్షేమంగానే ఉన్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తనపై దాడి జరిగిన తర్వాత జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు తనను భయపెట్టలేవు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఇలాంటి పిరికిపంద చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలన్న తన సంకల్పం మరింత బలపడుతుందని స్పష్టంచేశారు.
 
విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనపై వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. ఆయనకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరగడంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాడి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.