ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (18:25 IST)

శివాజీ చెప్పినట్టుగానే జగన్‌పై ప్రాణహానిలేని దాడి.. 'ఆపరేషన్ గరుడ'లో చివరికి జరిగేది...

టాలీవుడ్ హీరో శివాజీ చెప్పినట్టుగానే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ప్రాణహాని లేని దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ప్రతిపక్ష నేతపై దాడి జరిగే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా అప్పట్లో గ్రాపులు గీసి మరీ వివరించారు. ప్రాణహానిలేకుండా చిన్నదాడి జరిగే అవకాశం ఉందని వివరించారు. ఇప్పుడు, ఆయన చెప్పినట్టే జరగడంతో శివాజీ చెప్పిన 'ఆపరేషన్ గరుడ'పై మరోమారు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
గతంలో శివాజీ చెప్పిన విషయాలను ఓసారి పరిశీలిస్తే, 'నేను ఎవరి పేర్లూ చెప్పను. నాకున్న ఇబ్బందులు నాకున్నాయి. మీకు విషయం అర్థమవుతుంది. అర్థమైన వాళ్లు అర్థం కాని వాళ్లకు వివరించి చెప్పండి' అంటూ నాడు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 
 
ఒక జాతీయ పార్టీ ఆపరేషన్‌ ద్రవిడ అమలు చేస్తోందన్నారు. ఏపీ, తెలంగాణ లక్ష్యంగా 'ఆపరేషన్‌ గరుడ', కర్ణాటకలో ఆపరేషన్‌ కుమార, తమిళనాడు, కేరళకు కలిపి ఆపరేషన్‌ రావణ పేరిట ఈ తతంగం నడుస్తోందని చెప్పారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది కూడా ఇందులో భాగమే అని తెలిపారు.
 
ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా, పసిబిడ్డలాంటి ఏపీని అతిదారుణంగా దెబ్బ తీసేందుకు జాతీయ పార్టీ స్కెచ్‌ వేసిందన్నారు. అధికార పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇది జరుగుతుందన్నారు. సీబీఐ కేసులు తెరవడం, ఆ పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చక్రబంధంలో ఇరికించడం... 2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ గరుడ లక్ష్యమన్నారు. 
 
దీనికోసం... రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారని చెప్పారు. 'ఈ వ్యూహంలోకి కొందరు అభిమన్యుల్లా ప్రవేశిస్తారు. ఇలా వచ్చే వారిలో ఒక కొత్త నాయకుడు ఉన్నారు. అందరికంటే ఇతను ప్రమాదకరం. తనకు రాష్ట్రంపై బాధ్యత ఉన్నట్లు, తాను పరిశోధన చేసినట్లు ప్రజల్లోకి కొన్ని సంకేతాలు పంపిస్తారు. ఆయనకు ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు, ఒక సీనియర్‌ పాత్రికేయుడు సహకరిస్తారు. నిజానికి... కొత్త నాయకుడి వ్యూహం గురించి వీరికి కూడా తెలియదు! అధికార పార్టీని అలజడిలోకి నెట్టడమే ఈ కొత్త నాయకుడి పని' అని శివాజీ వివరించారు. 
 
ఆపరేషన్‌ గరుడలో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పార్టీయే అసలు బలి పశువు అవుతుందన్నారు. ఆ పార్టీ నాయకుడిపై ఉన్న కేసులను అడ్డు చేసుకుని దగ్గరికి తెచ్చుకుంటారన్నారు. ఆ ముఖ్య నాయకుడిపై ప్రాణహాని లేకుండా దాడి చేయిస్తారన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌, గుంటూరులో రెక్కీ కూడా జరిగిందన్నారు. ప్రాణహాని లేని దాడి తర్వాత అల్లర్లు సృష్టిస్తారన్నారు. ఈ దాడిని రాయలసీమకు చెందిన ఒక ముఖ్య నాయకుడి కుటుంబంపై వేసే యోచన కూడా ఉందన్నారు. 
 
'ఒడిసా, బీహార్‌ వ్యక్తులు హింసకు పాల్పడతారు. రాష్ట్రంలో అలజడి మొదలవుతుంది' అని తెలిపారు. అధికార పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అప్పటికే ఉన్న సీబీఐ కేసులూ ఇక్కట్లలోకి నెడతాయన్నారు. చివరగా... ఈ ఆపరేషన్‌కు క్లైమాక్స్‌ పడుతుందన్నారు. అల్లర్లు, అలజడని కారణంగా చూపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్నారు.
 
ఇక చివరగా, ఏపీలోని ప్రాంతీయ పార్టీలన్నీ నిర్వీర్యం అవుతాయని శివాజీ చెప్పారు. 'ఎన్నికల్లో జాతీయ పార్టీకి, కొత్త పార్టీకి సీట్లు వస్తాయి. కేసులు, ఆర్థిక ఇబ్బందులు, అలజడుల సుడిలో చిక్కుకున్న అధికార పార్టీ దెబ్బతింటుంది. మరో ముఖ్య నాయకుడిని పెండింగ్‌ కేసుల్లో జైలుకు పంపిస్తారు. ఆ పార్టీ కథ ముగుస్తుంది.
 
అధికార పార్టీలో ఉన్న నేతలంతా ఇతర రెండు మూడు పార్టీల్లోకి వెళతారు. ఎన్నికలు జరుగుతాయి. కొత్తపార్టీకి, ముఖ్యపార్టీకి సీట్లు వస్తాయి. ఇక... కొత్త పార్టీ నాయకుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటారు. ఆయన తనకు వద్దని అలిగి వెళ్లిపోతాడు. మొత్తంగా మూడు పార్టీల కథ ముగుస్తుంది. దీంతో ఆపరేషన్‌ గరుడకు తెర పడుతుందని హీరో శివాజీ వివరించారు. ఆపై... జాతీయ పార్టీకి చెందిన తెలుగు వ్యక్తే ఏపీకి ముఖ్యమంత్రిగా వస్తారన్నారు. 'ఆ వ్యక్తి ఎవరో మీకూ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నారు.