శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (08:15 IST)

జగన్‌ గన్నేరు పప్పు: లోకేశ్‌

"జగన్‌ మాట్లాడే తెలుగులో తప్పులు...ఇంగ్లీషులో తప్పులు...లెక్కల్లో కూడా ఎంత వీకో? ఇప్పుడు ఆయనను ఏమనాలి? గన్నేరు పప్పు అనొచ్చుకదా? తెలుగులో ఓ పదం అటుఇటుగా పలికుండొచ్చు. దానికే నన్ను పప్పు...పప్పు అంటూ ఎగతాళి చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్‌ తెలుగు చూడండి"
అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు.

అయినా, తన పదాల ఉచ్ఛారణలోని పొరపాటు వల్ల రాష్ర్టానికి ఏం అన్యాయం జరిగిందని, పెట్టుబడులు వెనక్కు పోయాయా అని, పోలవరం ఆగిందా...అమరావతి పనులు ఆగిపోయాయా అని ప్రశ్నించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జగన్‌ సరిగ్గా ఉచ్ఛరించలేని తెలుగుపదాల తాలూకూ క్లిప్పింగ్‌లను ఈ సందర్భంగా మీడియా కోసం ఆయన ప్రదర్శించారు.
 
‘‘శాసనసభ సభ్యుణ్ణి కాని నా గురించి మంగళవారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పదేపదే ప్రస్తావించి, విమర్శించారు. అయినా స్పీకర్‌ మిన్నకుండిపోయారు. అందుకే ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నవాడిగా మీడియా ముందుకువచ్చాను’’ అని వివరించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ఇప్పుడు వారానికి ఒక రోజు కోర్టుకు వెళ్లాల్సిన జగన్‌... రేపోమాపో బెయిల్‌ రద్దయితే మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుందన్నారు.

అలాంటి వ్యక్తి చెప్పే నీతులు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. క్రమశిక్షణగా పెరిగానని, వీళ్లలా తానేమీ వీధి రౌడీలా పెరుగలేదన్నారు. ‘నన్ను విమర్శించే మంత్రులకు ధైర్యముంటే శాసనమండలికి వచ్చి చర్చించాలని సవాల్‌ చేస్తున్నా.

మా నాయకుడి గురించి...మీ నాయకుడి గురించి...మీనాయకుడిపై వున్న కేసులను చర్చించుకుందాం’’ అని తీవ్రస్వరం వినిపించారు. అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశామని ఆరోపిస్తున్నారని, వచ్చిన ఈ ఆర్నెల్లలో ఏం చేశారని ప్రశ్నించారు.
 
‘‘హెరిటేజ్‌ ఫ్రెష్‌ను అమ్మేశామని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. అయినా అందులో మాకు షేర్లున్నాయని మంత్రి బుగ్గన ఆరోపించారు. బుగ్గనకు పలు కంపెనీల్లో వేల షేర్లు ఉన్నాయి. ఆ కంపెనీల యాజమాన్యం ధరలు పెంచితే వాటికి ఆయన బాధ్యత వహిస్తారా? జగన్‌ పత్రిక ప్రారంభంలో పత్రికను రూ.రెండుకు అమ్మాలని ఆయన పెద్ద ఉద్యమం చేశారు కదా! పత్రిక వారిదే.. షేర్లు వారివే...యాజమాన్యం వారిదే... మరి ఆ పత్రికను ఏడు రూపాయలకు పెంచి అమ్ముతున్నారేం?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.

పాదయాత్రలో అది పెంచుతా, ఇది పెంచుతా అని అంటుంటే.. పింఛను, రేషన్‌ పెంచుతాడేమోనని పేదలు ఆశ పట్టారనీ, కానీ, ఆయన వచ్చి ఇసుక, ఉల్లి, మద్యం, జగన్‌ పత్రిక, ఆర్టీసి ఛార్జీలు ఇలా అన్ని ధరలూ పెంచేశారన్నారు. రేపోమాపో విద్యుత్‌ చార్జీలూ పెంచుతారన్నారు. గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రిగా చేసిన కృషికి 53 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రాష్ట్రానికి లభించాయని, అలాంటి నన్ను ఇంత అవమానకరంగా మాట్లాడతారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘సొంత కొడుకును గెలిపించుకోలేకపోయారని చంద్రబాబును ఉద్దేశించి పదేపదే అంటున్నారు. వారికి ఒక్కటే చెబుతున్నా. నేనేమీ చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునే బ్యాచ్‌ కాదు. నాన్న గెలిచిన చోటే గెలిచి కాలరెగరేసే రకం కానేకాను. పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ నుంచొని గెలవాలనే లక్ష్యంతో పనిచేశాను. సరే...ఓడిపోయాను. అలాగని నియోజకవర్గానికి దూరంగా వెళ్లలేదే! ప్రజల్లోనే తిరుగుతున్నా. ఇది తప్పా’’ అని లోకేశ్‌ నిలదీశారు.