జగన్ రెడ్డి ఉండగా...ఉల్లి ఎందుకు?: పవన్ వ్యంగ్యం
వైకాపా ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ ధ్వజమెత్తారు. ఉల్లి ధరలు పెరగడంపై ట్విట్టర్ వేదికగా జనసేనాని మండిపడ్డారు.
నిత్యావసరాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరగడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రైతు బజార్ల వద్ద ఉల్లి కోసం ప్రజలు బారులు తీరిన ఫొటోను ట్వీట్ చేసిన పవన్.. వైకాపా ప్రభుత్వ వైఫల్యానికే ఇదే తార్కాణమని అన్నారు.
ఈ సందర్భంగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అనే సామెతను పవన్ ఉదహరించారు. జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదని కాబోలు.... దాని అవసరం లేదని రేటు పెంచారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఉల్లి ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..?: చంద్రబాబు
ఉల్లి ధరలపై తెదేపా నిరసన రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతూ పోతుంటే ప్రభుత్వం.. ప్రజలను వారి కర్మకు వారిని వదిలేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని తెదేపా నేతలు నిరసన తెలిపారు.
తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చూపి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉల్లి ధరలు బంగారంతో సమానంగా ఉన్నాయన్నారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని.. రాయితీపై తక్కువ ధరలో ఉల్లి అందించామని గుర్తు చేశారు. ధరలు దిగొచ్చేవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.