గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (10:54 IST)

జగన్ 'టార్గెట్ పాలిటిక్స్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని, తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓటర్లను తెచ్చి అప్రజాస్వామికంగా వ్యవహరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తదుపరి జరిగిన ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. 'టార్గెట్ పేరుతో అత్యంత ప్రమాదకరమైన ఆటను ప్రారంభించారని అగ్రహం వ్యక్తంచేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలుత 80 శాతం సీట్లు సాధించాలని చెప్పి.. ఆ తర్వాత 100 శాతమంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలకూ టార్గెట్ విధించారన్నారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లోనూ అదే పోకడతో పోయారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములనేవీ సర్వ సాధారణమని, అవి ప్రజలిచ్చే తీర్పు ఆధారంగా ఆధారపడి ఉంటాయని, నాడు ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ఓటమి పాలైన సంఘటనలున్నాయని గుర్తుచేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందనే సమాచారం అందరికీ తెలుసని చెప్పారు. ఆ విషయం తెలిసి కూడా లక్షల కొలదీ మెజార్టీ సాధన కోసం..

టార్గెట్ పాలిట్రికకు జగన్ పాల్పడటం సరికాదన్నారు. కడపజిల్లాతోపాటు బెంగుళూరు రాష్ట్రం నుంచి దొంగ ఓటర్లను పెద్దఎత్తున తిరుపతికి తరలించి, ప్రజాస్వామ్యాన్ని జగన్ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు. పోలీసులు, వలంటీర్లతో రాజకీయాలు నడిపించారని విమర్శించారు.

జగన్ కు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదని, ప్రతిపక్షాలంటే గౌరవం లేదని, ఎన్నికలంటే అషామాషాగా తీసుకుంటున్నారని తూర్పారబట్టారు. దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరగడంతో ప్రజలు అందోళన చెందుతున్నారని అన్నారు. ఏడాది క్రితం నుంచి కరోనాతో చాలా మరణాలు సంభవించాయని, ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని గుర్తుచేశారు.
 
మోదీ నిత్యం రాజకీయాల కోసమే ప్రాకులాడుతున్నారని.. పెరుగుతున్న కేసుల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎపీలోనూ రెండోదశ కరోనా ఉ ధృతి బాగా పెరుగుతోందని, పరీక్షలు చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి పాజిటివ్ కేసు నమోదవ్వడం కరోనా తీవ్రతకు అద్దంపడుతోందని చెప్పారు. కేసులు పెరుగుతున్న సమయంలో విద్యా సంస్థలను నడపడం, పరీక్షలను నిర్వహించడం మంచిది కాదన్నారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయాలని డిమాండు చేశారు. కరోనా నియంత్రణ కోసం సీఎం జగన్ అఫ్ లైన్/ఆన్లైన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

అటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కరోనా రీత్యా ఒకప్రక్క సర్వదర్శనాలను నిలిపివేశామంటూనే మరోప్రక్క అధిక ధరల టిక్కెట్ల అమ్మకంతో దర్శనాలకు అనుమతించడం తగదని చెప్పారు. ప్రమాదకరంగా మారిన కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని డిమాండు చేశారు.
 
జడ్జి రామకృష్ణ పై రాష్ట్ర ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టడాన్ని ఖండించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దళితులు క్రియాశీలకంగా వ్యవహరించారన్న విషయాన్ని జగన్ గుర్తెరగాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రారంభం నుంచి దళితుల పైనే అత్యధికంగా కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు.

అమరావతిలో ఎస్సీల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై జడ్జి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలనూ తాము సమర్థించడం లేదన్నారు. ఇప్పటికైనా జగన్ స్పందించి జడ్డి రామకృష్ణ పై పెట్టిన రాజద్రోహం కేసును తొలగించి.. దళితుల్లో ఈ ప్రభుత్వానికి సముచిత గౌరవం ఉందనే విషయాన్ని నిరూపించుకోవాలని సూచించారు.