సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (14:51 IST)

జగన్ - సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు : తీర్పు సెప్టెంబరు 15కు వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పిటిషన్లపై బుధవారం తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించింది. కానీ, మరోమారు ఈ తీర్పును వాయిదావేసింది. తుది తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని తెలిపింది. 
 
జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గత నెలాఖరులో వాదనలు ముగిశాయి. సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
 
సీఎం స్థాయిలో ఉన్న జగన్ తనకున్న అధికారాన్ని ఉపయోగించి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తన పిటిషన్ లో రఘురాజు పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి, విచారణను త్వరగా ముగించాలని కోర్టును ఆయన కోరారు. వివిధ కారణాలను చెపుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని చెప్పారు.