శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:02 IST)

వైఎస్సార్ నాయకుల తాట తీస్తాను తప్ప తలొంచను: పవన్

వైసీపీ నేతలపై జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలకు భయం ఏంటో నేర్పిస్తానని. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమన్నారు. పేదలకు నిత్యావసర వస్తువులపై వివిధ రకాల పన్నులను మోపుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. 
 
'ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆడపడుచులను తిట్టిస్తారా?. మీకు ఆడబిడ్డల్లేరా? ఇంట్లో ఆడపడుచులు లేరా?. నేను కోట్లు ట్యాక్స్‌ కట్టే సినీరంగం నుంచి వచ్చిన వాడిని. 2014లో చంద్రబాబు నా ఆఫీస్‌కు వచ్చారు. చంద్రబాబును రమ్మనటానికి కారణం మాకు గౌరవం కోరుకోవటమే. నా ఆత్మాభిమానంపై దెబ్బకొడితే అంతే గట్టిగా బదులిస్తా. జగన్ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించిన రోజే ఓ మాట చెప్పా. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని` చెప్పానన్నారు. భగత్ సింగ్, బోస్, గాంధీలకు తలవంచుతా. వైఎస్సార్ నాయకుల తాట తీస్తాను తప్ప తలొంచను.. అన్నారు. తనను గెలిపిస్తే... అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని పవన్‌ స్పష్టం చేశారు.
 
వృద్ధులకు పింఛన్లు ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారని పవన్ చెప్పారు. వైసిపి కేవలం కిరాయి గూండాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు, కాకినాడల్లో థియేటర్లన్నీ వైసిపి నాయకులకు చెందినవే అని అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతుందని, ఆఖరికి మాంసం దుకాణాలనుసైతం ప్రభుత్వమే నడిపించే స్థాయికి దిగజారిందని మండిపడ్డారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ 'నేను యుద్ధం ప్రకటించను.. కాని మీరులాగితే వదిలి వెళ్లను. నన్ను తిడితే భయపడతారనుకుంటున్నారేమో.. ఎంత భయపెడితే అంతగా బలపడతాను. వైసిపి నాయకులకు భయమంటే ఏమిటో చూపిస్తా....కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతా. ఇది ఇడుపులపాయ కాదు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం` అని పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేసిన దాఖలాలు వైసిపి పాలనలో ఇప్పటి వరకు లేదని ఆరోపించారు. వివిధ రకాల పన్నులు, మద్యం వ్యాపారాలు, జీఎస్టీలతో సహా వైసిపి చెప్పిన విధంగా రాష్ట్ర ఆదాయం లక్షకోట్లకు పైగా ఉంటుందని అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఐటీ రిటర్న్స్ వివరాల ప్రకారం జగన్ వద్ద రూ.700కోట్లున్నాయని పవన్ ఆరోపించారు
 
కోడి కత్తి కేసు గురించి అడిగితే వారు స్పందించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. వివేకా హత్య కేసు గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. వైకాపా అధినేత కూడా తన వ్యక్తిగతం గురించి మాట్లాడారు కానీ తన తలిదండ్రులు సంస్కారం నేర్పారన్నారు.