మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 29 సెప్టెంబరు 2021 (19:06 IST)

భ‌య‌ప‌డ‌ను... త‌ల‌వంచ‌ను... ప్ర‌శ్నించ‌డం అప‌ను!

సాటి మనిషి కి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనద‌ని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల గురించి తాను ప్రశ్నించడం తప్పా అని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు అని విమర్శించారు.
 
 తాను మహానుభావులకు మాత్రమే తల వంచుతాను అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్ణీత సమయానికి వేతనాలు రావడం లేదని, అలాగే పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేదని, వైసిపి నేతలకు అరవడం తప్ప‌, మాట్లాడటం రాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం అమ్మే మద్యంలో మామూళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి అని నిలదీశారు. ఏపీలో అభివృద్ది గురించి మాట్లాడటానికి ఏమీ లేదని అన్నారు. 2014 లో టిడిపి, బీజేపీకి అభివృద్ది కోసమే మద్దతు ఇచ్చాన‌ని, నేరుగా రాజకీయాల్లోకి రావాలి అని తాను ఏనాడూ అనుకోలేదని చెప్పారు.