పవన్ కల్యాణ్ కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా?
ఆ సన్నాసి నన్నేం తిట్టాడు ... నేను ఏం మాట్లాడాను? అంటూ ఏపీ సమాచార మంత్రి పేర్ని నాని పవన్ కల్యాణ్ కు తీవ్ర కౌంటర్ ఇచ్చారు. నేను బూతులు తిట్టలేదు కాబట్టే, టీవీలో నా ప్రెస్ మీట్ ప్రసారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్..ఉరేయ్ అని పిలవమని అంజనాదేవి నేర్పించారా? నేను రెడ్లకు పాలేరునైతే ... పవన్ కమ్మవాళ్లకు పాలేరు... ఎస్... నేను జగన్ దగ్గర పాలేరునే... నీకు చెప్పే దమ్ముందా? నన్ను అవమానించాలని చూస్తే, ఆ అవమానాన్ని పరిచయం చేస్తా అని పేర్నినాని చెప్పారు.
దేశంలో కిరాయికి రాజకీయపార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని, రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని రాష్ట్ర మంత్రి పేర్నికామెంట్ చేశారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా చెప్పారని, ఇండస్ట్రీ బ్రతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు సిద్ధమని చిరంజీవి చెప్పారని పేర్ని నాని వెల్లడించారు.
సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లే సంఘటనలు ఉత్పన్నమవుతున్నాయని, ఒకసారి కలుస్తామని నిర్మాతలే తమను కోరారని, అందుకే మచిలీపట్నం రమ్మన్నామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వం ఆలోచించే తీరులో మాలో కూడా కొన్ని లోపాలున్నాయని ఏకాభిప్రాయంకి వచ్చి ఆన్ లైన్ టిక్కెటింగ్ మీద ఇండస్ట్రీయే ప్రభుత్వాన్ని కీరిందని, ప్రభుత్వం తనంతట తాను ఇండస్ట్రీని పిలవలేదని వారు స్పష్టం చేశారన్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ గురించి చాలామందికి తెలియదని, ఇప్పటికే ఆన్లైన్ విధానంలో టిక్కెటింగ్ జరుగుతోందని, కొత్తగా ప్రవేశపెట్టియేది ఏమీ కాదని చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రీపై ప్రభుత్వానికి ఉన్న అనుమానాలు తొలిగిపోయేందుకు ఆన్లైన్ విధానం కోరుతున్నారన్నారు.