సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 6 జులై 2018 (21:05 IST)

కేంద్రం నేరం చేసింది... న్యాయ పోరాటం చేస్తాం... కాల్వ శ్రీనివాసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేశామంటూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొనడం నేరమని, దానిపై దేశ అత్యున్న న్యాయస్థానంలో నరేంద్రమోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర సమాచార, పౌర

అమరావతి : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేశామంటూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొనడం నేరమని, దానిపై దేశ అత్యున్న న్యాయస్థానంలో నరేంద్రమోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్లో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశ వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. 
 
ఏపీ పునర్విభజన చట్టం అమలుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అసత్యాలను కోర్టుకు చెప్పడం తీవ్రమైన నేరమన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నరేంద్రమోడి ప్రభుత్వ ద్వంద్వ నీతిని, నిరంకుశ వైఖరిని గట్టిగా నిరసించాలని మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటామన్నారు. ఉమ్మడి ఆస్తుల సమస్యలను కేంద్రం పరిష్కారించడం లేదన్నారు. 
 
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆర్థికలోటు, రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం ఆశించి కొండంతని, వచ్చింది మాత్రం గోరంతని అన్నారు. ఏపీ పునిర్వభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుర్నీతిని, దుర్మార్గాన్ని ఎండగడతామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా న్యాయ స్థానంలో పోరాడాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేయాలని మంత్రి వర్గంలో చర్చించామన్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడి, సుప్రీం కోర్టు తలుపులు తట్టాలని సమావేశంలో చర్చించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులనుంచి స్వయంగా కొనుగోలు చేయడం వల్ల రూ.2,300 కోట్ల భారం పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. 
 
రాష్ట్రాలకు చేయూతనివ్వాల్సిన కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని మంత్రి కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తంచేశారు. గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలుకు ముందుకు రావడం లేదన్నారు. కొన్ని సమయాల్లో రైతుల నుంచి కొనుగోలుచేసిన పంటలకు కేంద్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదన్నారు. దీనిపై కేంద్రం తీరును గట్టిగా నిరసిస్తూ, బిల్లులు సకాలంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.