శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 17 ఫిబ్రవరి 2018 (21:13 IST)

జగన్ మోహన్ రెడ్డి పిలుపుకు ప్రజలు నవ్వుకుంటున్నారు... మంత్రి కాల్వ

అమరావతి : కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టుకునేందుకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో జైలుకెళ్లిన ఆర్థిక నేరగాడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాల్సిన అగత్యం తమ పార్టీకి గాని, ప్రభుత్వానికి గాని లేదని రాష్ట్ర సమాచార,

అమరావతి : కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టుకునేందుకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో జైలుకెళ్లిన ఆర్థిక నేరగాడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాల్సిన అగత్యం తమ పార్టీకి గాని, ప్రభుత్వానికి గాని లేదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మచ్చలేని నేతగా సీఎం చంద్రబాబునాయుడుకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. ఆయన నేతృత్వంలో పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను హక్కుగా సాధించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కారణంగా దురదృష్టకర పరిస్థితుల్లో మూడున్నరేళ్ల కిందట జరిగిన విభజనతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని, ఎటువంటి ఆదాయం లేకుండా నవ్యాంధ్ర ఏర్పడిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. అటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు అహర్నిశలూ శ్రమిస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళుతున్నారన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అలక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. 
 
ఇదే విషయమైన మూడున్నరేళ్ల నుంచి 29 పర్యాయాలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సీఎం చంద్రబాబునాయుడు వివరిస్తూ వచ్చారన్నారు. ఆనాడు విభజనకు సాక్ష్యంగా నిలిచిన అన్ని పార్టీలకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను వివరిస్తున్నామన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సాధించుకోడానికి జగన్, పవన్ కల్యాణ్ వంటి నేతలు కృషి చేస్తున్నారు. ఇందుకు తమ పార్టీ, ప్రభుత్వం స్వాగతిస్తోందన్నారు. అయితే, టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి, కేంద్ర నుంచి హక్కుల సాధనకు తనతో కలిసి పోరాడాలని జగన్ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఆర్థిక నేరుగాడు జగన్ తో తమ పార్టీ, ప్రభుత్వం పనిచేయాల్సిన కర్మ పట్టలేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో మచ్చలేనినాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. అటువంటి నాయకుని నేతృత్వంలో ఉన్న పార్టీ తనతో కలిసి పనిచేయాలని పిలుపునివ్వడంపై ప్రజలు నవ్వుకుంటారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. జగన్ పిలుపుపై నవ్వాలో... ఏడవాలో తెలియని పరిస్థితి తమలో కూడా నెలకొందన్నారు.
 
ప్రత్యేక హోదా డిమాండ్‌కు కట్టుబడి ఉన్నాం...
ప్రత్యేక హోదాపై జగన్ పోరాటంపై ప్రజలకు నమ్మకం కలుగడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ... మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం జరుపుతోందన్నారు. తొలిసారిగా ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన పార్టీ టీడీపేనని మంత్రి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రత్యేక హోదాపై తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపించామన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... ప్రత్యేక హోదా వల్ల కలిగే అన్ని లాభాలనూ ప్రత్యేక ప్యాకేజీలో అందిస్తామని మాటిచ్చారన్నారు. పేరు ఏదయినా రాష్ట్రానికి లబ్ది కలగాలనే ఉద్దేశంతో ఆనాడు తమ నేత, సీఎం  చంద్రబాబునాయుడు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదనకు సరేనన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో అంశాలకు కాలపరిమితి పేర్కొనాలని ఆనాడే సీఎం చంద్రబాబునాయుడు... కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారని మంత్రి కాల్వ శ్రీనివాసులు గుర్తు చేశారు.
 
దిక్కుతోచకే ఎంపీల రాజీనామా డ్రామా....
పార్లమెంట్‌లో న్యాయం కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటంతో ప్రతిపక్ష నేత జగన్‌లో భయాందోళనలు నెలకొన్నాయని, దిక్కుతోచని పరిస్థితుల్లో తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని ప్రకటించారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు దుయ్యబట్టారు. తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ మాటలు ఇప్పటివి కావని, ఎప్పటి నుంచో ఇవే మాటలు చెబుతూ వస్తున్నారని అన్నారు. ఎంపీల రాజీనామాల వల్ల ఒరిగిదేమీ లేదన్నారు. కేంద్ర బడ్జెట్ వైఎస్ఆర్ సిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడిని శ్రీకృష్ణుడిగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అర్జునుడిగా కీర్తిస్తూ జగన్ పత్రిక పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తోందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తమ పార్టీ ఎంపి సుజానా చౌదరి పార్లమెంట్‌లో మాట్లాడితే, ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు.