కేంద్రం నుండి ఇళ్ల నిర్మాణానికి సహాయం అందడం లేదు... కానీ మేం వదలం... కాల్వ
అమరావతి : రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం నుండి తగిన సహకారం లభించడం లేదని రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.
అమరావతి : రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం నుండి తగిన సహకారం లభించడం లేదని రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. శాసనమండలిలో గృహనిర్మాణంపై శుక్రవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కేంద్రం నుండి మంజూరైన ఇళ్లకు కూడా తగిన రీతిలో నిధులు అందడం లేదన్నారు.
ఇళ్ల మంజూరులో అన్యాయం జరగడంతో పాటు మంజూరు చేసిన ఇళ్లకు నిధుల విడుదల విషయంలోనూ కేంద్రంలో అలక్ష్య ధోరణి కనిపిస్తోందన్నారు. పట్టణ గృహనిర్మాణానికి తొలివిడతలో రూ.1018 కోట్లు విడుదల చేయాల్సి వుండగా రూ.181 కోట్లు మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అక్రమాలను నిరోధించేందుకు గృహనిర్మాణ శాఖలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు.
నిర్మాణంలో వున్న ఇళ్లు ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకోవడంతోపాటు బిల్లులు సత్వర చెల్లింపు కోసం పారదర్శక విధానాలు అనుసరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అర్ధంతరంగా ఆగిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన దశ నుండి ఇంటిని పూర్తిచేసేందుకు అవసరమైన సహాయాన్ని లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు.
పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజా జీవనాన్ని ఉన్నత ప్రమాణాలకు తీసుకువెళ్లే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వేల కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. గృహనిర్మాణాల ద్వారా రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల విలువైన ఆస్తులను సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గృహ నిర్మాణానికి మంజూరు చేసిన రుణంలో కొంత సబ్బిడీగా ఇచ్చేవారని, తమ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు పూర్తి ఉచితంగా ఇస్తోందన్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మూడు లక్షల ఇళ్లను నిర్మించామన్నారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో పది లక్షల ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు లక్ష్యంగా నిర్దేశించారని, యీ లక్ష్య సాధన దిశగా తాము కృషి చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, తెగల వారికి చట్టపరంగా దక్కాల్సిన వాటా కంటే అధికంగా గత మూడేళ్లలో ఇళ్లు మంజూరు చేశామన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో 6 లక్షల ఇళ్లను నిర్మించాల్సి వుండగా, ఇప్పటికే 5.31 లక్షల ఇళ్లకు లబ్దిదారుల ఎంపిక పూర్తయ్యిందన్నారు. ఇందులో ఎస్.సి.లకు 95,679 ఇళ్లు(22.94 శాతం), ఎస్.టి.లకు 29,923 ఇళ్లు(7.17శాతం) మంజూరు చేశామన్నారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో రూ.4,150 కోట్ల మేరకు ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం నివేదిక అందజేసిందని, 14.4 లక్షల ఇళ్లు రికార్డుల్లో చూపినవి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు. విజిలెన్స్ విభాగం 149 గ్రామాల్లో నమూనా 12,489 ఇళ్లను నమూనా తనిఖీలు చేసిందని, ఇందులో 1200 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేలిందన్నారు. ఇందులో 190 మందికి ప్రమేయం వున్నట్టు నిర్దారించారని తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించి 554 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో 113 గృహనిర్మాణ సంస్థ అధికారులు, 15 మంది ఇతర శాఖల అధికారులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మరో 55 మంది అనధికారులపై కూడా కేసులు నమోదు చేశారని చెప్పారు.