నాని అంటే ఒక నమ్మకం, నిజం. వరుసగా నాలుగు సార్లు గెలిచిన విజయం. గుడివాడ రాజకీయంలో ఆయన ఒక సంచలనం. సంవత్సరాల తరబడి తమదైన శైలిలో జిల్లా రాజకీయాలు నడిపిన ఎన్నో కుటుంబాలను మట్టి కరిపించిన ఘన చరిత్ర నానిది. పూర్తి పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కానీ గుడివాడ నాని అంటే విశ్వవ్యాప్తంగా తెలియని తెలుగువారు ఉండరు.
వైసిపిలో ఉన్నా తాను అన్న ఎన్‌టిఆర్ వీరాభిమానినని గర్వంగా చెప్పుకోగల నిర్భయం ఆయన సొంతం. తన రాజకీయ గురువు నందమూరి హరికృష్ణ అన్న విషయాన్ని ఆయన మరువరు. నిన్నటి వరకు గుడివాడ రాజకీయాలలో వినిపించిన పిన్నమనేని, రావి, కఠారి ఇప్పుడు వినిపించటం లేదు. కొత్తగా హడావుడి సృష్టించిన దేవినేని అన్న పదాలు కూడా ఇక కనిపించకపోవచ్చు.
గుడివాడ గడ్డ కొడాలి అడ్డ అన్నది అక్షర సత్యం కాగా, శనివారం ఆంధ్రప్రదేశ్ అమాత్యునిగా కొడాలి బాధ్యతలు తీసుకోనున్నారు. నాని అంటే ఒక ప్రత్యేకత. ఆయన ఆహార్యం, మాటతీరును దూరంగా పరిశీలించిన వారికి ఒకింత భయం. దగ్గరగా చూస్తే కొడాలి ఒక మానవతావాది. సగటు మనిషి బాధను అర్ధం చేసుకోగల మంచి మనస్సు నాని సొంతం. కష్టం, నష్టం ఏది చెప్పుకున్నా తన జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చే కొండంత అండ కొడాలి. నమ్మిన వారి కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయటం, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవటం నాని నైజం.
రాజకీయంగా నాని ఎత్తుగడలను అందుకోవటం ఇతరులకు ఊహకు అందని విషయం. నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నిక కాగా, ప్రతిసారి భిన్న వ్యూహం. నిన్నటిది నేడు ఉండదు. రేపటి గురించి ప్రత్యర్ధులు ఆలోచిస్తూ ఉంటే ఆయన మరో రోజు ముందుంటారు. ఆయన ఏ పని చేసినా సంచలనమే. గుడివాడ సమస్యల కోసం హైదరాబాద్‌కు పాదయాత్ర చేసినా, తెలుగుదేశం శాసనసభ్యునిగా ఉన్నప్పటికీ నాటి సిఎం వైఎస్ఆర్ గుడివాడ వస్తే సమస్యలు పరిష్కరించాలని విన్నవించినా కనిపించని కొత్తదనమే.
ఓ దళిత రైతు మృతి చెందితే మృతదేహాన్ని మోసుకొచ్చి నాటి మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావును అడ్డుకుని, పోలీసు కాల్పుల వరకు సమస్య పెరిగి పెద్దదైనా వదిలి పెట్టకుండా రైతుకు న్యాయం చేయించిన గుండె నిబ్బరం కొడాలి నాని సొంతం. ఐసిపి శాసనసభ్యునిగా ఉంటూ దివంగత ఎన్‌టిఆర్ జయంతి, వర్ధంతులకు హాజరు కావటాన్ని ఎవ్వరూ ఊహించలేరు. ఇలా ఊహకందని రీతిగా వ్యవహరించటం, ప్రత్యుర్దులు ఆలోచించుకునేలోగా కోలుకోలేని దెబ్బ కొట్టటం కొడాలి రాజకీయ చతురత.
రవాణా రంగ నేపధ్యం ఆయన కుటుంబానిది. వ్యాపార, సినీ, రాజకీయ రంగాలలో ఆయన పాదముద్రలు చెరపలేనివి. ఎటువంటి రాజకీయ నేపధ్యం లేనప్పటికీ పెద్ద కుటుంబాల నడుమ రారాజులా వెలుగొందగలగటం కేవలం ఆయన ప్రతిభా పాటవాలకు ప్రతీకలు. రెండుసార్లు తెలుగుదేశం శాసనసభ్యునిగా గెలిచిన కొడాలి మరో రెండు సార్లు వైసిపి ఎంఎల్ఎగా గెలుపొంది, ఇప్పుడు మంత్రిగా ప్రజాసేవకు పునరంకితం కాబోతున్నారు.
రాజకీయంగా నాని స్పందన ఎప్పుడు ఒకింత ఘాటుగానే ఉన్నప్పటికీ అందులో నిజం ఉంటుంది. ఇటీవలి అంశాన్నే తీసుకుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా నాటి సిఎం బాబు, నానిని హైదరాబాద్ నివాసిగా చిత్రించే ప్రయత్నం చేయగా, సిఎం సతీమణి వ్యాపారాలు ఎక్కడ, మనవడి స్కూలు ఎక్కడ అంటూ నిర్భయంగా ప్రశ్నించటం ఆయన సొంతం.
-రవి కుమార్ బొప్పన