శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (15:38 IST)

బాలికను వేధించిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్టు!!

arrest
ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పని చేసే బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఆయనను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. 
 
తన ఇంట్లో పనిచేసే బాలికతో సుధాకర్ గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, తాజాగా అరెస్టు చేశారు.
 
కాగా, గత 2019 ఎన్నికల్లో సుధాకర్‌ వైకాపా తరపున కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోదరుడు సతీశ్‌కు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయించిన విషయం తెల్సిందే.