పోషకాహార లోపాలకు ముగింపు పలుకుతూ శిశుమరణాలను నివారించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పధకంగా ఉన్న పోషణ్ అభియాన్ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపును దక్కించుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. నీతి అయోగ్ వెలువరించిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
నీతి అయోగ్ పలు అంశాలకు సంబంధించి ప్రతి సంవత్సరం వార్షిక నివేదికను విడుదల చేస్తుండగా, అందులో పోషణ్ అభియాన్ కార్యక్రమాల అమలు ఒకటిగా ఉందన్నారు. పరిపాలన-వ్యవస్థాగత యంత్రాంగం, సేవలు అందించడం - సామర్ధ్యాలు పెంచుకోవడం, వ్యూహం - ప్రణాళిక, కార్యక్రమాల అమలు వంటి నాలుగు అంశాల ఆలంబనగా నీతి అయోగ్ పోషణ్ అభియాన్ అమలులో ముందున్న రాష్ట్రాలను గుర్తించటం జరిగిందన్నారు.
ఈ నాలుగు విభాగాలలోనూ తనదైన సత్తా చూపిన ఆంధ్రప్రదేశ్ అన్నింటా ప్రధమస్ధానంలో నిలిచి ఈ ప్రత్యేక గుర్తింపును పొందగలిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో, ఆయన సూచనల మేరకు చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగానే తమకు ఈ గుర్తింపు దక్కిందని కృతికా శుక్లా వివరించారు. ఈ పరిశీలనలో భారతదేశాన్ని పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి పనితీరును పరిగణనలోకి తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రాల జాబితాలో ప్రధమ స్ధానాన్ని సంపాదించుకోగా, చిన్న రాష్ట్రాలలో మిజోరాం ప్రధమర్యాంకును దక్కించుకుందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో నాగర్ హవేలి గుర్తింపును సొంతం చేసుకుందని తెలిపారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహార యొక్క ప్రాధాన్యం తెలియజేయడం, ఆ దిశగా ఆహారం తీసుకునేలా అలవాటు చేసుకునేలా చేయడం, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఏ ఆహారం ఎంత మేరకు అవసరమో తెలియ జేయడం, పోషకాహారాల్లో ఏ తరహా శక్తి ఎంత మేర ఉంటుందో సమగ్రంగా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా పోషణ్ అభియాన్ పధకం పనిచేస్తుందని కృతికా శుక్లా వివరించారు.
మూస ధోరణులను విడనాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలకు సులభతరమైన పనివిధానాన్ని అమలు చేస్తున్నామని ఆక్రమంలోనే రిజిస్టర్లును రాయడానికి బదులుగ ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి దానిలో కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్(CAS) యాప్‌ను నిర్ధేశించామన్నారు. ఫలితంగా లబ్దిదారులకు మెరుగైన సేవలను అందించటం సాధ్యమైందన్నారు.
ఈ యాప్ సమాయాను సారంగా గృహ సందర్శనల అవశ్యకతను తెలియచేస్తుందని, ఫలితంగా సరైన సమయంలో పిల్లలకు ఖచ్చితమైన బరువులు, ఎత్తులు చూసి మొబైల్ అప్లికేషన్లో అప్డేట్ చేసి వారి తల్లిదండ్రులులకు చిన్నారుల పోషక ఆహార పరిస్థితిని తెలియచేయగలుగుతున్నారన్నారు. CAS యాప్‌ను ఉపయోగించి మెరుగైన సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రతినెల 500 రూపాయలు ప్రోత్సహాకం అందిస్తుండగా, దాదాపు 80 శాతం కార్యకర్తలు వీటిని అందుకుంటున్నారని డాక్టర్ శుక్లా తెలిపారు.
పోషణ్ అభియాన్ అమలులో భాగంగా ప్రతినెల అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్‌ల సామర్థ్యాలను మెరుగుపరచటానికి శిక్షణ ఇవ్వడం ద్వారా నిరంతరం వారి పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని ఫలితంగానే జాతీయ స్థాయిలో ఈ గుర్తింపును పొందగలిగామని తెలిపారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా సామాజిక ఆధారిత కార్యక్రమలు, అన్నప్రాసన, శీమంతం, మూడు సంవత్సరాల పిల్లలను ప్రీస్కూల్‌కు సిద్ధం చేయటం, పురుషులకు ఆరోగ్య విషయాలపై అవగాహనా కల్పించటం, పోషణ వేడుక నిర్వహించి దానిలో గ్రామస్థులందరిని పాల్గొనేలా చేయటమే కాక, ప్రతి కార్యక్రమానికి రూ.250 చెల్లిస్తున్నామన్నారు. మరోవైపు పిల్లల బరువులు, ఎత్తులు చూసేందుకు ఆధునిక పరికరాలను సమకూర్చామని డాక్టర్ కృతిక తెలిపారు.