శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 23 జనవరి 2020 (21:59 IST)

కేసుల సత్వర పరిష్కారం ధ్యేయంగా దిశ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు: కృతిక శుక్లా

దిశ చట్టం అమలు కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దిశ కేసుల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక న్యాయ స్ధానాలను ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్తర్వులు జారి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఏర్పడిన దిశ చట్టం రాష్ట్రపతి ఉత్తుర్వులకు లోబడి అమలులోకి రానుండగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు యుద్ద ప్రాతిపదికన చేస్తున్నామని దిశ ప్రత్యేక అధికారి కృతిక శుక్లా తెలిపారు. 
 
దిశ చట్టం కింద నమోదైన కేసులను కాలపరిమితితో కూడిన  సత్వర విచారణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదేశాలకు లోబడి గురువారం న్యాయశాఖ జివో ఎంఎస్ నెంబర్ 17ను విడుదల చేస్తూ స్పష్టమైన అదేశాలు ఇచ్చింది. జివోను అనుసరించి ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే ఈ కోర్టులలో 21 మంది సిబ్బంది నియామకం అవనుండగా, ప్రతి జిల్లా కేంద్రం లోనూ ఇవి ఏర్పాటు అవుతాయి. 
 
కోర్టుల నిర్వహణ కోసం ఏడాదికి 1.93 కోట్ల మొత్తానికి సైతం ఈ జివో మార్గం సుగమం చేసింది.  ఈ వ్యవహారాలను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్ధానం పర్యవేక్షిస్తుంది. జిల్లా జడ్డి ఒకరు, సూపరిండెంట్ లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, స్టేనో గ్రాఫర్ ముగ్గురు, జూనియర్ అసిస్టెంట్ ముగ్గురు, టైపిస్టులు ఇద్దరు, ఎగ్జామినర్ ఒకరు, కాపియిస్ట్ ఒకరు, రికార్డు అసిస్టెంట్ ఒకరు, అటెండెర్లు ఐదుగురు ప్రతి కోర్టులోనూ పనిచేయనున్నారు.
 
దిశ చట్టం అమలుకు సంబంధించి ఇప్పటికే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలలో ఉన్న ఐఎఎస్ అధికారి కృతికా శుక్లాను దిశ ప్రత్యేక అధికారిగా నియమించగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు మహిళల రక్షణే ధ్యేయంగా ఈ చట్టం రూపుదిద్దుకుని అమలుకు సిద్దం అవుతోంది. మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలపై విచారణ కోసం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేక ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడగా, ఈ వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉంది.
 
మరోవైపు లైంగిక వేధింపులకు గురైన వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలు సంతృప్తి కరంగా ఉన్నాయా లేదా అన్నవిషయాన్ని కూడా ఈ చట్టం క్రియా శీలకంగా పరిశీలించనుంది. ఇక్కడ మంచి ప్రమాణాలు ఉన్న వైద్యం, పరిక్షా కేంద్రాలు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని కృతికా శుక్లా తెలిపారు.
 
చట్టం అమలులో భాగంగా బాధితులకు వేగవంతమైన వైద్య సేవలు అందనుండగా, ప్రతి బోధన, జిల్లా ఆసుపత్రిలో దిశా చట్టం కోసం పత్యేక వైద్య కేంద్రం ప్రారంభిస్తారు. సున్నా ఎఫ్ఐఆర్ నమోదుతో సహా బాధితులకు అన్ని రకాల సామాజిక, చట్టపరమైన సహాయం అందించటంతో పాటు, వారిలో మానసిక స్ధైర్యాన్ని నింపే తీరుగా నిరంతరం ఒక కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రాలలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి, గైనకాలజిస్టులు అందుబాటులో ఉండనుండగా, మరోవైపు ఈ కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
 
చట్టం అమలులో భాగంగా మహిళలు, పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాల నియంత్రణకు ఒక ప్రామాణిక నిర్వహణా విధానం అభివృద్ధి చేయనుండగా, మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసులలో సంక్షేమం, ఉపశమనం, పునరావాసం, పోలీసులతో సహకారం వంటి మొత్తం బాధ్యతలను దిశ ప్రత్యేక అధికారి సమన్వయపరుస్తారు.