బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 13 ఫిబ్రవరి 2020 (21:17 IST)

ఒప్పంద ఉద్యోగుల మినిమం టైమ్ స్కేల్ అమలు నిబంధనలకు విరుద్ధం: డాక్టర్ కృతికా శుక్లా

రాష్ట్రంలో బాలల సంరక్షణ కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం కావడాన్ని సహించేది లేదని స్త్రీ, శిశు సంక్షేమశాఖ సంచాలకులు కృతికా శుక్లా హెచ్చరించారు. రాష్ట్రంలో బాలల సంరక్షణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని, ఆ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించడం సరికాదన్నారు. గతంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖలో నెలకొన్న ఈ తరహా అవకతవకలను సరిచేసేందుకు కృషి చేస్తున్నామని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. 
 
బాలల సంరక్షణ విభాగం, జువైనెల్ జస్టిస్ బోర్డుల పరిధిలో సేవలు అందించవలసిన ఉద్యోగులు, నిబంధనలకు విరుద్ధంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. కాంట్రాక్టు పద్దతిలో పనిచేసే ఈ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర అర్ధిక శాఖ అనుమతి లేకుండా మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్న విషయాన్ని సైతం తమ దృష్టికి వచ్చిందన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద వచ్చే నిధుల వినియోగం విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా కేంద్రం అనుమతితోనే జరగాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో నిధుల మంజూరుకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని కృతికా శుక్లా పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలల సంరక్షణ పథకం కింద ప్రతి జిల్లాలోనూ శిశు సంరక్షణ సొసైటీలు, వీధి బాలల కోసం అటు నగరాలు, ఇటు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక అవాస కేంద్రాలు, అనాధ బాలల కోసం గృహాలు ఏర్పాటు చేసి వారి సంరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 
 
బాలల సంక్షేమం కోసం జిల్లా స్థాయిలో కమిటీలు నియమించి, పర్యవేక్షణ చేపట్టడం ద్వారా, ప్రతి రూపాయి వారి కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే జిల్లా స్థాయిలో జువైనెల్ జస్టిస్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా, నిర్లక్ష్యానికి గురవుతున్న బాలల్లో నేర ప్రవృత్తి పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
 
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రభుత్వాలు ఇస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా బాధ్యతతో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. అందుకే గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిచేయాలని నిర్ణయించామని తెలిపారు. దీనిలో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తించి, దానిని సరిద్దిద్దే క్రమంలో తాజా ఉత్తర్వులు జారీ చేయటం జరిగిందన్నారు. 
 
ఈ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నిబంధనలకు భిన్నంగా వ్యవహారం సాగిందని, జిఓ నెంబర్ 24 ను అనుసరించి అర్ధిక పరమైన అనుమతులు లేకుండా మినిమం టైమ్ స్కేల్ అమలు చేసారని కృతికా శుక్లా వివరించారు.  ఈ వ్యవహారంలో ఉద్యోగులకు ఎటువంటి  ఇబ్బందులు ఎదురైనా, వాటిని నిబంధనల మేరకు పరిష్కరించేందుకు  ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.