మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (16:12 IST)

తిరుమలలో భారీ వర్షాలు-ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు (video)

Landslides
Landslides
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు కుండపోత వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల ధాటికి తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. 
 
రెండో ఘాట్ రోడ్డులోని హరిణి దగ్గర విరిగిపడగా.. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు సహాయచర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగించారు. 
 
భారీ వర్షాల నేఫథ్యంలో కొండ చరియలు విరిగిపడే అవకాశముందని టీటీడీ ముందుగానే అంచనా వేసింది. ఆ క్రమంలోనే అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది. ఇకపోతే బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  
 
బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోనే టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వర్షాలు తగ్గేవరకూ భక్తులు తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని టీటీడీ అధికారులు సూచించారు. 
 
తిరుమలతో పాటుగా శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. భారీ వర్షాలతో మాల్వాడిగుండం ప్రవహిస్తోంది.