బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (09:21 IST)

నేడే ‘వైయస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం

రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. రైస్‌ కార్డు కలిగిన కుటుంబాల కష్టాలను గుర్తించి, ఆపత్కాలంలో వారికి బాసటగా నిలుస్తూ ‘వైయస్సార్‌ బీమా పథకం’ అమలు చేస్తోంది. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ పథకాన్ని ప్రారంభిస్తారు. 
 
తమ కష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్న కుటుంబ పెద్ద సాధారణ లేక ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబం వీధిన పడకుండా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వైయస్సార్‌ బీమా పథకం అమలు చేస్తోంది. ఇందుకోసం లబ్ధిదారుల తరఫున బీమా సంస్థలకు రూ.510 కోట్లకు పైగా ప్రీమియమ్‌ చెల్లించనుంది.

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో అకస్మాత్తుగా కుటుంబ పెద్ద మరణించడం లేదా అంగ వైకల్యానికి గురైన పరిస్థితుల్లో సదరు కుటుంబం పడే అవస్థలను ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ స్వయంగా చూశారు.

ఆర్థికంగా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిన పలు కుటుంబాల దీనావస్థను చూడటమే కాదు, వారి కష్టాలను స్వయంగా విన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా నిలబడాలన్న లక్ష్యంతో వైయస్‌ఆర్‌ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. 
 
బీమా ప్రయోజనాలు:
రాష్ట్రంలో రైస్‌ కార్డులు కలిగిన కుటుంబాలు వైయస్‌ఆర్‌ బీమా పథకం కింద అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి వుండి, కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. 

18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు. అలాగే లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే రూ. 5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు. 

ఇక 51–70 ఏళ్ల మధ్య వయస్సు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది. దీనితో పాటు 18–70 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక, శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు. 
 
బీమా ప్రీమియంను భరిస్తున్న ప్రభుత్వం:
వైయస్సార్‌ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తోంది. ఆ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

దీనివల్ల 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఒకవైపు కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం వైయస్‌ జగన్‌ ‘వైయస్సార్‌ బీమా పథకాన్ని’ అమలు చేస్తున్నారు.