శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:30 IST)

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు పలువురు నేతలు నివాళి

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (63) బుధవారం సాయంత్రం చెన్నైలో కరోనావైరస్ కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అంబేద్కర్ ఆడిటోరియంలో బల్లి దుర్గాప్రసాద్‌కు సంతాప సభ ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానంద రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయులు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్ర శేఖర్, తలారి రంగయ్య అలాగే ఏపీ భవన్ ఉన్నతాధికారులు, అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డిలు దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
 
బల్లి దుర్గాప్రసాద్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా గెలిచారని ప్రతిసారి తన ఆశీస్సులు తీసుకునేవారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయన మరణం కుటుంబానికే కాదు వ్యక్తిగతంగా తనకు కూడా లోటని ఆయన అన్నారు. అలాగే బల్లి దుర్గాప్రసాద్ గారు ఏదైనా భోళాగా మాట్లాడే మనిషి, నిరంతరం పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం పరితపించేవారని తెలిపారు.
 
ఆయన అకాల మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని తెలిపారు. ఇటీవల స్వల్ప అనారోగ్యం కారణంగా దుర్గాప్రసాద్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దాంతో మూడు వారాల పాటు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయినా దుర్గాప్రసాద్ గుండెపోటుతో మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.