శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (09:21 IST)

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన అల్లు అర్జున్.. కేసు నమోదుకు ఫిర్యాదు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కరోనా వైరస్ నేపథ్యంలో నేరడికొండలో ఉన్న కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేశారు. ఇక్కడకు పర్యాటకుల ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అయితే, అల్లు అర్జున్‌తోపాటు "పుష్ప" సినిమా యూనిట్ నిబంధనలు ఉల్లంఘించి జలపాతాన్ని సందర్శించిందని సాధన స్రవంతి ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 
 
అంతేకాకుండా, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండానే షూటింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్‌రాజు పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించినప్పటికీ, ప్రాథమిక విచారణ తర్వాత మాత్రమే కేసు నమోదు చేస్తామని తెలిపారు.