పోయినవారిని తీసుకుని రాలేం.. కానీ, అండగా నిలుస్తాం : చెర్రీ ఆర్థిక సాయం (video)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. పవన్ బర్త్‌డే వేడుకల్లో భాగంగా, మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి బలయ్యారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం అలముకుంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, చనిపోయిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయాల్సిందిగా చిత్తూరు జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
అలాగే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్ర నిర్మాతలు కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇకపోతే, ఈ విషాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, హీరో రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హీరో అల్లు అర్జున్ పెద్ద మనసు చేసుకొని మరణించిన కుటుంబం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇక రాంచరణ్ ప్రతి కుటుంబానికి 2.50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు తన ట్వీట్‌లో తెలిపారు. మరణించిన వారిని తిరిగి తీసుకురాలేము. ఇలాంటి సమయంలో వారి కుటుంబాలని ఆదుకునేందుకు నా వంతుగా ఈ సాయం చేస్తున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.