శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:20 IST)

ప్రాణాలు కోల్పోయిన పవన్ అభిమాన కుటుంబాలకు ఆర్థికసాయం...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికిగురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మెగా ఫ్యామిలీ హీరోలంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేనా.. వారికి తమ వంతుగా ఆర్థిక సాయం చేశారు. అలా మొత్తం 12.50 లక్షల చొప్పున ఒక్కో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందనుంది. 
 
ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగింది. బ్యానర్లు కడుతున్న సమయంలో కరెంటు వైర్లు తగిలి రాజేంద్ర, అరుణాచలం, సోమశేఖర్ అనే ముగ్గురు పవన్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో వారి కుటుంబాలపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
 
ఈ క్రమంలో జనసేన పార్టీ మాత్రమే కాకుండా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, 'వకీల్ సాబ్' చిత్రబృందం, మెగా సూర్య ప్రొడక్షన్స్ కూడా ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. 
 
ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12.5 లక్షల మేర ఆర్థిక సాయం అందనుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు విరాళం ప్రకటించిన అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.