మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (22:23 IST)

కుక్కతో పోటీ పడతాం: మంత్రి పేర్ని నాని

విశ్వాసంలో తాము కుక్కతో పోటీ పడతామని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. వైఎస్ బొమ్మ, జగన్ కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, బతికున్నంత కాలం తాము జగన్ వెన్నంటే ఉంటామని మంత్రి నాని స్పష్టం చేశారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాఘురామకృష్ణంరాజు పార్టీని వీడాలనుకుంటే వీడొచ్చని సూచించారు. అంతేతప్ప అడ్డగోలు మాట్లాడటం సరికాదన్నారు.

పక్క చూపులు చూసిన ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి ఏమయ్యిందో అందరికీ తెలుసునని అన్నారు. ఆయన అంత గొప్పోడే అయితే నామినేషన్ వేసి ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారని నాని ప్రశ్నించారు.

బలమైన వ్యక్తే అయితే ఎన్నికల వేళ ఆ పార్టీ.. ఈ పార్టీ ఎందుకు తిరిగారని నిలదీశారు. సొంతంగానే పోటీ చేసి గెలవకపోయారా? అని అన్నారు.

తనవల్లే నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పుకుంటున్నరఘురామకృష్ణంరాజు.. ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు పడ్డాయో.. ఆయనకు ఎన్ని ఓట్లు పడ్డాయో చూసుకోవాలన్నారు.

ఆయనే ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఎమ్మెల్యేలకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్లు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. అచ్చెన్నాయుడును గోడ దూకి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని రఘురామకృష్ణంరాజు అనడం సరికాదన్నారు.

కాంగ్రెస్ నేత చిదంబరాన్ని అరెస్ట్ చేసినప్పుడు మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. చిందంబరం ఏమైనా నక్సలైటా? అప్పుడు మోదీకి ఈ విషయాలు ఎందుకు చెప్పలేదని మంత్రి ప్రశ్నించారు. ప్రతి పార్టీకి ఓ వ్యూహం ఉంటుందని, రఘురామకృష్ణంరాజు కోరిక ఎప్పటికీ నెరవేరదని అన్నారు.