శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (10:01 IST)

మందు బాబులకు షాక్.. ఏపీలో భారీగా పెరగనున్న మద్యం ధరలు... ఎందుకంటే?

నవ్యాంధ్రలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. మద్యం దుకాణాల లైసెన్సు ఫీజుతో పాటు.. మద్యం రేట్లను భారీగా పెంచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇది మద్యం బాబులను షాక్‌కు గురిచేసే అంశం. 
 
అయితే, మద్యం ధరలు భారీగా పెంచాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణం లేకపోలేదు. వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో నవ్యాంధ్రలోదశలవారీగా మద్యం నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఆ విధంగానే నవ్యాంధ్రలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో 2024 నాటికి రాష్ట్రాన్ని మద్యరహిత రాష్ట్రంగా చేయనున్నట్టు ప్రకటించారు. కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్ళలోనే మద్యం అందుబాటులో ఉంటుంది. 
 
ఇందులోభాగంగా, మద్యం దుకాణాలను దశల వారీగా ఎత్తివేసేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. అయితే, ఈ విధానంలో పలు కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలున్నాయి. వీటిని ఒకేసారి రద్దు చేయకుండా యేడాదికి 20 శాతం చొప్పున వచ్చే ఐదేళ్లలో మొత్తం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫలితంగా మద్య నిషేధం హామీ అమలు చేసినట్టు అవుతుందని భావిస్తోంది.
 
మద్య దుకాణాలను ఎత్తివేయడం ద్వారా తగ్గే ఆదాయాన్ని ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా లైసెన్స్ ఫీజులు పెంచడం, మద్యం రేట్లు పెంచడం వంటివాటిపై కసరత్తు చేస్తోంది. మద్యం రేట్లను భారీగా పెంచడం వల్ల తాగే వారి సంఖ్య తగ్గుతుందని, ఆ రకంగా కూడా మద్య నిషేధం కొంతవరకు అమలు అవుతుందని అంచనా వేస్తోంది. మొత్తంమీద వైకాపా ఇచ్చిన హామీల్లో రెండో హామీ అమలు దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.