శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:43 IST)

విశాఖ నుంచి పరిపాలన - ముహూర్తం ఖరారు చేసిన సీఎం జగన్

cmjagan
విశాఖపట్టణం పరిపాలన సాగించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం విజయదశమి పండుగను ముహూర్తంగా ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. పరిపాలన కోసం అవసరమైన కార్యాలయాల నిర్ధారణ కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, గురువారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలను సీరియస్‍గా తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని ఆయన తమ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. 
 
ప్రత్యేక కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని, దసరా పర్వదినం నాటికి కార్యాలయాల తరలింపు పూర్తి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాడేపల్లిలో బుధవారం ఏపీ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సంబంధిత మంత్రులు అన్ని అంశాలతో సభకు రావాలని కోరారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామన్నారు. కాగా, గురువారం నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.