శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 జూన్ 2023 (12:49 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో మూడు రోజుల వర్షాలు

rain
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా, ఉత్తర కోస్తాంధ్రలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరిక చేసింది. 
 
వెస్ట్ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలను అనుకున్న అపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించింది. సముద్ర మట్టానికి 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. నైరుతి వైపుగా సాగుతోందన్నారు. ఉపరితల ఆవర్తనం ఆదివారం అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 
 
ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావం సముద్రం ఉధృతంగా ఉందని, చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖ తుఫాను హెచ్చరికలను కేంద్రం సూచించింది.