మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (11:52 IST)

బే ఆఫ్ బెంగాల్‌లో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌‌తో పాటు.. ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. 
 
ఇది వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా రాగల రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.