సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (15:43 IST)

మారుతీ రావు ఆస్తుల చిట్టా... అమృతకు చిల్లిగవ్వ ఇవ్వకుండా వీలునామా?

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీ రావు ఆత్మహత్య తర్వాత ఆయన అస్తుల చిట్టా బయటకు వచ్చింది. ఆయనకు ఏకంగా రూ.200 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇందులో పలు షాపింగ్ మాల్స్, ఎకరలా భూమి, హైదరాబాద్‌లో ఐదు ఫ్లాట్స్ ఇలా అనేక రకాలైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్తులన్నింటినీ తన సోదరుడు శ్రవణ్, భార్య గిరిజా రావు పేరుమీద రాసినట్టు సమాచారం. ముఖ్యంగా, తన కుటుంబం రోడ్డునపడటానికి, తాను హత్య కేసులో చిక్కుకోవడానికి ప్రధాన కారణమైన కుమార్తె అమృతకు చిల్లిగవ్వ కూడా దక్కకుండా మారుతీ రావు వీలునామా రాసినట్టు తెలుస్తోంది. 
 
మిర్యాలగూడలో కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం ప్రారంభించిన మారుతీ రావు ఆ తర్వాత రైస్ మిల్లుల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వీటిని కూడా విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. ఈ రంగంలో శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో అనేక విల్లాలను కట్టి విజయవంతంగా విక్రయించారు. ఈ క్రమంలో ఆయన రూ.కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులను సంపాదించారు. 
 
తన కుమార్తె పేరుతో ఓ పాఠశాలను కూడా స్థాపించారు. అలాగే, అమృత ఆసుపత్రి పేరుతో వంద పడకల హాస్పిటల్‌ ఉంది. ఆయన భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి, అంతేగాక ఆయనకు హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం ఉంది. 
 
మరోవైపు హైదరాబాద్‌లో పలు చోట్ల ఐదు ఫ్లాట్లు, నల్లగొండలోని మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెం క్రాస్ రోడ్‌లో మరో షాపింగ్ మాల్ ఉన్నాయి. మారుతీ రావు తల్లి పేరుతో కూడా రెండంతస్తుల భవనం ఉంది. ఇవేగాక మిర్యాల గూడ బైపాస్ రోడ్‌లో 22 గుంటల భూమి ఆయనకు ఉన్నట్టు తెలుస్తోంది.