శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 3 మార్చి 2021 (20:00 IST)

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వ్యవసాయ రుణాల పేరుతో భారీ మోసం

విజయవాడ నగరంలో ఓ కొత్త తరహా మోసం వెలుగుచూసింది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనకున్న ఓ యువ రైతును వైట్ కాలర్ నేరగాళ్లు నిలువునా మోసం చేశారు. ఓ ప్రతిష్టాత్మక బ్యాంకు నుండి వ్యవసాయ రుణం మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికి లక్షలు దండుకున్నారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఇన్స్యూరెన్స్ ఛార్జీలలో పాటు, కమీషన్ల పేరుతో దాదాపు ఐదు లక్షల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టారు.
 
రుణ మంజూరు పేరిట నెలల తరబడి నాటకాలాడుతూ వచ్చిన మోసగాళ్లు.. నాకు మీ లోన్ వద్దు మహాప్రభో.. నేనిచ్చిన డబ్బులు, ఆస్తిపత్రాలు నాకు తిరిగిచ్చేయండని లబోదిబోమన్న బాధితుడికి చుక్కలు చూపిస్తున్నారు. నీ లోన్ హోల్డ్‌లో ఉంది.. ఇప్పుడు వద్దంటే నువ్విచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా వెనక్కురాదు.. నీ ఆస్తిపత్రాలు నీకివ్వాలంటే మరో రెండు లక్షలివ్వాలంటూ వేధింపులకు దిగారు.
 
వివరాల్లోకి వెళితే..
సురేష్ కుమార్ అనే యువ రైతు తనకున్న భూమిలో అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. సురేష్ అంకితభావం, వ్యవసాయం పట్ల అతనికున్న ప్రేమను గుర్తించిన కొందరు రైతులు తమ భూములను సైతం సురేష్‌కి కౌలుకిచ్చారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి, ఆదర్శ రైతుగా నిలవాలనుకున్న సురేష్.. అందుకు అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలనుకున్నాడు.
 
వ్యవసాయ రుణం కోసం ప్రయత్నిస్తున్న సురేష్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ప్రతినిధులమంటూ కొందరు వ్యక్తులు సంప్రదించారు. యువ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి తమ బ్యాంకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, సదరు స్పెషల్ లోన్ ప్రోగ్రాంలో భాగంగా అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామని నమ్మబలికారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నుండి లోన్ మంజూరయితే అంతకన్నా కావలసిందేముందన్న సురేష్ కుమార్.. నాలుగు కోట్ల రూపాయల వ్యవసాయ రుణానికి దరఖాస్తు చేశాడు.
 
లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఫార్మాలిటీల పేరుతో ఐదు లక్షల రూపాయలు దండుకున్న మోసగాళ్లు.. ఆస్తుల పరిశీలన, హామీదారుల నుండి సంతకాలు తీసుకోవడం తదితర కార్యక్రమాలతో కొద్దిరోజులు హడావుడి చేశారు. దాదాపు మూడు నెలల అనంతరం మీకు కోటి రూపాయల లోన్ మాత్రమే మంజూరయ్యింది.. అంతకంటే ఎక్కువ మొత్తం కావాలంటే ఐదు శాతం ఫార్మాలిటీ ఇవ్వాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు.
 
కోటి రూపాయలే కావాలనుకుంటే తెల్లకాగితంపై సంతకం చేసివ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో అనుమానించిన సురేష్ కుమార్.. నాకు లోన్ అవసరం లేదు.. నేనిచ్చిన డబ్బులు, నా ఆస్తిపత్రాలు తిరిగిచ్చేయండని తేల్చిచెప్పాడు. కథ అడ్డం తిరగటంతో లోన్ వద్దంటే కట్టిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తిరిగిరాదని, ఆస్తిపత్రాలు తిరిగివ్వాలంటే రూ.2 లక్షలు చెల్లించాల్సి వుంటుందని మోసగాళ్లు బెదిరింపులకు దిగారు. తన అప్లికేషన్ గురించి తెలుసుకునేందుకు బందరురోడ్డులోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు వెళ్లిన సురేష్ కుమార్.. అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానంతో షాక్‌కి గురయ్యాడు.
 
మీరు చెప్తున్న అగ్రికల్చర్ లోన్ విభాగం వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరని బ్యాంకు సిబ్బంది వివరంగా చెప్పడంతో, మోసపోయినట్లు గ్రహించిన సురేష్ కుమార్ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అగ్రికల్చర్ లోన్ పేరుతో సురేష్ కుమార్‌కు మస్కా కొట్టిన మోసగాళ్ల వలలో మరింత మంది చిక్కుకుని నిలువు దోపిడీకి గురయినట్లు సమాచారం. లోన్ ప్రాసెసింగ్ పేరుతో దొరికినంత దోచుకోవడం.. దరఖాస్తుదారుడికి విసుగొచ్చి వదిలేసేంత వరకు తిప్పించుకోవడంలో సదరు కేటుగాళ్ల ముఠా ఆరితేరినట్లుగా తెలుస్తోంది.
 
కేసు నమోదు.. పరారీలో నిందితులు
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణలంక పోలీసులు వెల్లడించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అగ్రి లోన్స్ విభాగానికి చెందిన శ్రీనివాస చక్రవర్తి, సుధాకర్‌లతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మోసం వెలుగులోకి రావడంతో కేసు నుండి బయటపడేందుకు సామదానబేధ దండోపాయాలను ఉపయోగిస్తున్న నిందితులు.. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.