విజయవాడ : రాష్ట్ర విభజనానంతరం ఏపీని పునాదుల స్థాయి నుంచి నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూనే, మరోవైపు వ్యవసాయాభివృద్ధికి ప్రోత్సాహమందిస్తోంది. ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండడంతో పాటు అదే సమయంలో సాగు విస్తీర్ణం పెంపుదలకూ ప్రణాళికయుతంగా ముందుకు సాగుతోంది. విత్తనాలు, ఎరువులు, యంత్రాల కొనుగోలులో రాయితీలందిస్తోంది. భూములకు సకాలంలో సాగునీరందించి, పంటల అధిక దిగుబడులకు చేయూతనందిస్తోంది.
ముఖ్యంగా భూ సమస్యలతో పాటు రికార్డుల్లో చోటు చేసుకున్న తప్పొప్పులను సరిచేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇప్పటికే మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని రెండు పర్యాయాలు చేపట్టింది. రైతుల నుంచి వస్తున్న ఆదరణను గమనించిన ప్రభుత్వం మూడో విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతోంది. అలాగే, డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో భూ లోక్ అదాలత్‌లు నిర్వహించబోతోంది. తహసీల్దార్ల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఈ లోక్ అదాలత్‌ల దృష్టి తీసుకురావొచ్చు. ఈ రెండు కార్యక్రమాలను ఎప్పుడు చేపట్టబోయేది త్వరలో వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.
త్వరలో మూడో విడత ‘మీ ఇంటికి మీ భూమి’...
భూ రికార్డుల్లో మార్పులుచేర్పుల కోసం ప్రభుత్వ చేపట్టిన మీ ఇంటికి మీ భూమికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత ఏడాది ఆగస్టు, నవంబర్ మాసాల్లో ప్రభుత్వం రెండు విడతులుగా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాలకు రైతుల నుంచి భారీగా వినతలొచ్చాయి. మరింత మంది రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మూడో విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం నిర్వహించడానికి రెవెన్యూ శాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ప్రజా సాధికార సర్వే చురుగ్గా సాగుతోంది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మూడో విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం నిర్వహించేలా రెవెన్యూ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
భూ లోక్ అదాలత్‌లతో మొండి సమస్యలకు పరిష్కారం...
కొన్ని మొండి సమస్యల కారణంగా భూ వివాదాలకు సకాలంలో పరిష్కారం లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, తమ విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇటువంటి మొండి సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం భూ లోక్ అధాలత్‌లు నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో భూ లోక్ అధాలత్‌లు నిర్వహించనున్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఈ లోక్ అధాలత్‌ల దృష్టికి రైతులు తీసుకురావొచ్చు. అలాగే, సరిహద్దులు, సర్వే నెంబర్లతో పాటు రికార్డుల్లో చోటు చేసుకునమ్న తప్పొప్పులు వంటి సమస్యలకూ ఈ లోక్ అధాలత్‌లో పరిష్కారం చూపుతారు.
’మీ ఇంటికి మీ భూమి’లో 12.41 లక్షల పరిష్కారాలు...
భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి రైతుల ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమం 16 నెలల కాలంలో లక్షలాది మంది రైతులు తమ భూములకు సంబంధించిన పరిష్కారాలు పొందగలిగారు. భూ రికార్డుల్లో నెలకొన్న తప్పొప్పును సరిచేసుకోడానికి గతేడాది ఆగస్టులో మొదటి విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. రైతుల నుంచి విశేష స్పందన రావడంతో, రెండో విడత కార్యక్రమానికి పూనుకుంది. రికార్డుల్లో భూ యజమానుల పేర్ల మార్పులు, యాజమాన్యం దఖలు, సర్వే నెంబర్ల తప్పులు సరిచేయుడం ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇలా రెండు విడతల్లో తమ సమస్యల పరిష్కారానికి 13,71,455 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 12,41,656 రైతుల సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించారు.
రెండు విడతలుగా జరిగిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లక్షా 66 వేల మందికి అన్నదాతల సమస్యలు పరిష్కారమయ్యాయి. శ్రీకాకుళంలో లక్షా 6 వేల మంది, విజయనగరం జిల్లాలో లక్షా 17 వేల 817 మంది సమస్యలు పరిష్కరించారు. విశాఖపట్నానికి చెందిన లక్షా 57 వేలా 103 మంది, పశ్చిమగోదావరికి చెందిన 53,968 మంది రైతుల సమస్యలను మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాల్లో పరిష్కరించారు. కృష్ణా జిల్లాలో లక్షా 2 వేలకు పైగా దరఖాస్తులు, గుంటూరులో 99,780 దరఖాస్తుల సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రకాశం జిల్లాలో 79,133 మంది, నెల్లూరులో 45,071 మందికి, చిత్తూరులో లక్షా 14 వేలా 769 మంది రైతులకు పలు సమస్యలకు పరిష్కారం చూపారు. కడపలో 72,447 దరఖాస్తులు, అనంతపురంలో 31,946 దరఖాస్తులు, కర్నూలు జిల్లాలో 94,440 దరఖాస్తులకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపారు.