సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:16 IST)

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 9న మెగా సీడ్ పార్క్‌కు శంకుస్థాపన, 650 ఎకరాలు...

అమరావతి : రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మెగా సీడ్ పార్కుకు ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస

అమరావతి : రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మెగా సీడ్ పార్కుకు ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మెగా సీడ్ పార్క్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 650 ఎకరాలు కేటాయించిందన్నారు. 
 
ఈ పార్క్ కోసం అమెరికాకు చెందిన ఐయోవా యూనివర్శిటీతో ఎంఓయూ కుదుర్చుకుంటుందన్నారు. రూ.670 కోట్లతో వ్యయంతో ప్రారంభం కానున్న మెగా సీడ్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేయనుందన్నారు. ఈ పార్కులో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రపంచ స్థాయి ప్రయోగశాలలు, సీడ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, విత్తన పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో పాటు విత్తన ఎగుమతి అవసరమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు.
 
ముఖ్యంగా విత్తన పరిశోధన, నవ్య ఆవిష్కరణలు చేపట్టడం, వ్యాపార అభివృద్ధితో పాటు విత్తన వ్యాపారానికి ఇంక్యూబేటర్ గా ఉండడం, మానవ వనరుల అభివృద్ధి పర్చడం, ప్రపంచ విత్తన కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ విత్తన విధి విధానాలకు చేయూతనివ్వడం, రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందివ్వడం వంటి కార్యక్రమాలకు మెగా సీడ్ పార్క్ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పార్క్ కోసం ప్రభుత్వం 650 ఎకరాలు కేటయించిందన్నారు. దేశంలో ఉన్న ప్రముఖ విత్తన కంపెనీలతో పాటు చిన్న కంపెనీలకు ఈ పార్కులో భూములు కేటాయిస్తామన్నారు. 
 
ప్రస్తుతం తమిళనాడులో ఉన్న సీడ్ పార్క్ దేశంలో ఉత్తమమైనదన్నారు. ఆ పార్క్ కంటే మిన్నగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో మెగా సీడ్ పార్కును నిర్మిస్తున్నామన్నారు. రూ.670 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ మెగా సీడ్ పార్కుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నామన్నారు. సీడ్ పార్క్ ఆవిష్కరణ కార్యక్రమంలో రైతు సంఘాలతో పాటు రాష్ట్ర, జాతీయ సీడ్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయన్నారు. వాటితోపాటు వ్యవసాయం, ఉద్యానవన యూనివర్శిటీ, ఐయోవా యూనివర్శిటీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారన్నారు.
 
18, 19 తేదీల్లో ఐయోవా సందర్శించనున్న సీఎం చంద్రబాబు...
వరల్డ్ ఫుడ్ ప్రైస్ కాన్ఫరెన్స్ సందర్భంగా అమెరికాలో ఉన్న ఐయోవా యూనివర్శిటీని ఈ నెల 16 నుంచి 20 తేదీల్లో తనతో పాటు అధికారుల బృందం సందర్శించనునందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అదే నెల 18, 19 తేదీల్లో ఐయోవా యూనివర్శిటీని సీఎం చంద్రబాబునాయుడు సందర్శించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ట్రాక్టర్ల పంపిణీలో రైతులపై ఎటువంటి భారమూ పడనీయ్యబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
 
అంతకుముందు జరిగిన సమీక్షా సమావేశంలో మెగా సీడ్ పార్క్ శంకుస్థాపన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చించారు. వేదిక సమీపంలో ప్రముఖ విత్తన సంస్థలతో పాటు చిన్న సంస్థలతో కూడిన విత్తన స్టాళ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఎం.డి. బాలకృష్ణ, ఎన్జీరంగా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడుతో పలువురు అధికారులు పాల్గొన్నారు.