శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (19:41 IST)

బస్తీమే సవాల్.. రోడ్డుపై కుర్చీలో కూర్చొని వైకాపా రెబెల్ ఎమ్మెల్యే సవాల్

mekapati chandrasekhar reddy
ఇటీవల వైకాపా నుంచి సస్పెండ్‌కు గురైన నెల్లూరు జిల్లా ఉదయగిరి జిల్లా వైకాపా రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక వైకాపా నేతలతో పాటు అధిష్టానం నేతలకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఉదయగిరి బస్టాండు సెంటరులో రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చొని వైకాపా నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. 
 
పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ వైకాపా నేతలు ఆయనకు హెచ్చరికలు పంపారు. దీంతో ఆయన గురువారం ఉదయగిరి బస్టాండ్ సెంటరులో కుర్చీ వేసుకుని కూర్చొని, తనను తరిమి కొడతానన్న వాళ్లు రావాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పెద్దల సంఖ్యలో ఆయన అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. 
 
కాగా, ఇటీవల ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీదేవిలపై వైకాపా అధిష్టానం సస్పెండ్ వేటు వేసింది. అప్పటి నుంచి ఉదయగిరి వైకాపా నేతలు మేకపాటిని టార్గెట్ చేశారు. విమర్శలు చెస్తూ నియోజకవర్గంలో అడుగుపెడితే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. దీంతో గురువారం ఉదయం ఆయన బస్టాండ్ సెంటర్‌కు వచ్చి బహిరంగ ఛాలెంజ్ విసిరారు.