బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (13:30 IST)

కుమార్తె ప్రేమ వ్యవహారం.. తండ్రి చెప్పాడని ప్రియుడికి దూరం.. చివరికి హత్య?

crime
కుమార్తె ప్రేమ వ్యవహారం తండ్రికి తెలియరావడంతో ఆమెతో తిరిగిన యువకుడిని హెచ్చరించాడు. దీంతో పగపెంచుకున్న యువకుడు ప్రియురాలి తండ్రిని హత్య చేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడలో నడిరోడ్డుపై వ్యాపారి అయిన ప్రియురాలి తండ్రిని యువకుడు  హత్య చేశాడు. బృందావన్‌ కాలనీలో కూతురి ముందే వ్యాపారిని ఓ యువకుడు దారుణంగా చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్‌ బృందావన్‌ కాలనీలో కిరాణాషాపు నడుపుతున్నారు. ఆయన కుమార్తె దర్శినికి శివమణికంఠ అనే టీచర్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే ఈ విషయం దర్శిని తండ్రికి తెలియరావడంతో కూతురికి బుద్ధి చెప్పాడు. 
 
ఆమె కూడా తండ్రి మాటను జవదాటకుండా శివకు దూరమైంది. ఆపై శివ పెద్దలతో పంచాయతీ పెట్టినా లాభం లేకపోయింది. ఆ తర్వాత రోజు నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. గురువారం మణికంఠ తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది.
 
దీని అంతటికి దర్శిని తండ్రి శ్రీరామచంద్ర ప్రసాద్ కారణమని మణికంఠ భావించాడు. అంతే నడిరోడ్డులో బైకుపై వచ్చిన తండ్రీకూతుళ్లపై దాడి చేశాడు శివ. కూతురు వద్దని పోరాడినా కనికరం లేకుండా శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో దాడి చేశాడు. 
 
ఈ ఘటనను గమనించి స్థానికులు అక్కడికి రాగానే మణికంఠ పారిపోయాడు. శ్రీరామచంద్ రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.  నిందితుడు మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.