వానలు- వరదలు.. చిమ్మచీకటి.. అడవిలో 65మంది భక్తులు.. ఆర్టీసీ బస్సు..?
నూజివీడు మండలం దేవరగుంట గ్రామానికి చెందిన 65 మంది భక్తులు గురువారం ఉదయం జంగారెడ్డిగూడెం సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లికి ప్రైవేటు వాహనంలో పూజలు చేసేందుకు వెళ్లి రాత్రి 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదలో చిక్కుకుపోయారు.
చీకటి కమ్ముకోవడంతో పాటు అడవిలో ఆలయంలో వుండటంతో వారిని రక్షించడానికి ఎవరూ లేరు. అదే గ్రామానికి చెందిన వంకాయలు హరిబాబు అనే భక్తుడు స్పందించి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి సమాచారం అందించగా వెంటనే స్పందించారు.
ఆర్టీసీ డిపో మేనేజర్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు డిపో మేనేజర్ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. వరదల్లో ప్రాణాలు పోయే స్థితికి చేరుకున్న తమను క్షేమంగా ఇంటికి చేర్చిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని భక్తులు కృతజ్ఞతలతో పాటు హర్షం వ్యక్తం చేశారు.