శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (14:15 IST)

గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం - గ్రామాల్లో నిద్రించాలంటూ

విశాఖ జిల్లా పాతపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ మృతుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం రూ.30 కోట్లను ఏపీ సర్కారు విడుదల చేసింది. ఈ సాయాన్ని జిల్లా యంత్రాంగం పంపిణీ చేస్తోంది. 
 
ఇందులోభాగంగా, సోమవారం మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లతో పాటు... విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణలు కలిసి మొత్తం ఎనిమిది మృతుల కుటుంబాలకు రూ.కోటి చెక్కును అందచేశారు. మిగిలిన కుటుంబాలకు న్యాయపరమైన చిక్కులు పూర్తయిన తర్వాత స్థానిక యంత్రాంగం అందజేస్తుందని మంత్రి కన్నబాబు తెలిపారు. అలాగే, గ్యాస్ బాధిత గ్రామాల ప్రజలు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి తమతమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే, గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్యాస్‌ లీక్‌ అనంతరం తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. జగన్‌కు  మంత్రులు, అధికారులు అన్ని వివరాలు అందించారు. సహాయక చర్యలతో పాటు బాధితులకు అందాల్సిన పరిహారంపై మంత్రులు, ఏపీ అధికారులకు జగన్ కీలక సూచనలు చేశారు. 
 
మృతుల కుటుంబాలకు ఇప్పటికే ఐదు కుటుంబాలకు పరిహారం ఇచ్చామని మంత్రులు జగన్‌కి చెప్పారు. కొందరు నగరానికి దూరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పరిహారం అందుకోలేకపోయారని, వారికి కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు. గ్యాస్ లీక్ జరిగిన గ్రామాల్లో, ఇళ్లలో శానిటేషన్ పనులు ప్రారంభమయ్యాయని, సోమవారం సాయంత్రం కల్లా పూర్తిగా ముగుస్తాయని తెలిపారు. 
 
కాగా, మూడు రోజుల్లో బాధితులందరికీ ఆర్థిక సాయం అందించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా చెప్పినట్లు మంత్రులంతా ఐదు గ్రామాల్లో సోమవారం రాత్రి బస చేయాలని ఆయన చెప్పారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ రూ.10 వేలు ఇవ్వాలని జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు సేకరించే పనిని వాలంటీర్లకు అప్పజెప్పాలని కోరారు. రాష్ట్రమంతా పరిశ్రమల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.