రెండు కోట్లిస్తాం, మా పాపను బతికించండి, సిఎం జగన్‌పై శ్రియ తండ్రి ఆగ్రహం
వైజాగ్ ఘటన ఎన్నో కుటుంబాల్లో చివరకు విషాదాన్ని మిగిల్చింది. 12 మంది మృతి చెందితే వందలమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఘటన జరిగిన రోజే ఆయన ఆసుపత్రికి వెళ్ళి బాధితులను పరామర్సించి ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అంతేకాదు బాధితులకు డబ్బులు ఇచ్చే దానిపై జిఓను కూడా విడుదల చేసి డబ్బులను మంజూరు చేశారు. అయితే మృతదేహాలతో ఎల్.జి. కంపెనీ ముందు వెంకటాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీని అక్కడ నుంచి పూర్తిగా తరలించేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను తీస్తున్న ఎల్.జి. పాలిమర్ కంపెనీ వద్దంటూ బోరున విలపించారు.
పోలీసుల కాళ్ళావేళ్ళా పడ్డారు. డి.జి.పి. గౌతం సవాంగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గ్యాస్ లీక్ ప్రమాదంలో ముద్దులొలికే చిన్నారి శ్రియ మృతి చెందింది. విషవాయువులను పీల్చి ఆమె చనిపోయింది. దీంతో ఆమె తండ్రి కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిన్నారి మృతి చెందితే ముఖ్యమంత్రి కోటి రూపాయలు ఇస్తానన్నారు. మాకు డబ్బులు ముఖ్యం కాదు. పాప పేరు మీద రెండు కోట్ల ఆస్తి ఉంది. ఆ ఆస్తిని అమ్మి ఇచ్చేస్తాం. పాపను బతికించమని చెప్పండి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం కన్నా ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలించేది తమకు ముఖ్యమంటూ వెంకటాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల 20 వేల మంది ప్రజలు ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న డిమాండ్‌ను వారు వ్యక్తం చేస్తున్నారు.