బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 8 మార్చి 2017 (06:32 IST)

లేని వృద్ధి ఉన్నట్లు చూపితే కేంద్రం నిధులు ఇస్తుందా? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును కడిగేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ వృద్ధి రేటు విషయంలో ఇలాగే దొంగలెక్కలు చెబుతూ పోతే కేంద్రం నయాపైసా కూడ విదిలించక పోయే రోజులు త్వరలో వస్తాయని ప్రతిపక్ష నేత వైకాపా అదినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆక్షేపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ వృద్ధి రేటు విషయంలో ఇలాగే దొంగలెక్కలు చెబుతూ పోతే కేంద్రం నయాపైసా కూడ విదిలించక పోయే రోజులు త్వరలో వస్తాయని ప్రతిపక్ష నేత వైకాపా అదినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆక్షేపించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఇక ఏ సహాయం కూడా అవసరం లేదనే తప్పు అభిప్రాయాన్ని చంద్రబాబు తప్పుడు లెక్కల ద్వారా కేంద్రానికి కలిగిస్తున్నారని విమర్సించారు.

అంకెలు మార్చి.. జీఎస్‌డీపీ భారీగా పెరిగినట్లు చూపడమంటే కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపినట్లు కాదా భారీగా వ్యవసాయ వృద్ధి రేటు నమోదైందని.. పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటే కేంద్రం ఏమనుకుంటుంది.. రాష్ట్రం తన కాళ్లపై తాను నిలబడగలదని  కేంద్రం అనుకోదా రూ.15 లక్షల పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్రమే చెబుతున్నప్పుడు.. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం భావించదా’’ అని జగన్ ప్రశ్నించారు.
 
‘‘అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంకెలు మారుస్తోంది ఎందుకు జీడీపీ తదితర గణాంకాలు తప్పుగా చూపిస్తోంది మనం తప్పుడు లెక్కలు చూపించడం అంటే కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపడమే కదా. భారీగా జీడీపీ పెరిగినట్లు, పరిశ్రమలు పెరిగినట్లు చూపించాల్సిన అవసరం ఏమిటి ఇలా చెబితే కేంద్రం ఎలా సహాయం చేస్తుంది అంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లే కదా!’’అంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

‘‘జీడీపీలో లేని వృద్ధి ఉన్నట్లు చూపడమంటే.. పన్నుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని కేంద్రం భావిస్తుంది. అలాంటపుడు కేంద్రం మనకు ఎందుకు నిధులు ఇస్తుంది రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబితే కేంద్రానికి ఎలాంటి సంకేతాలు వెళతాయి ఇక ప్రత్యేకహోదా ఇవ్వనవసరం లేదని కేంద్రం భావించదా  ఇది కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినట్లు కాదా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
మన రాష్ట్రం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో విడిపోయిందో అందరికీ తెలుసు. హైదరాబాద్‌ మహానగరం కోల్పోయాం. అయినా 2015–16లో దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రమని చెబుతున్నారు. 2016–17 మొదటి అర్ధభాగంలో 12.23 శాతం వృద్ధిరేటు సాధించిందంటున్నారు. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం.. వీటి అన్నింటి విలువ కట్టి, అది గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే జీడీపీ వృద్ధి చెందినట్లు లెక్క.

2015–16లో రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధిరేటు చూపిస్తే, దేశంలో అదే సమయంలో 7.57 శాతం వృద్ధిరేటు ఉంది. దేశం కన్నా మనం 5 శాతం ఎక్కువ సాధించామని చెప్పుకున్నాం. చెన్నైతో కూడిన తమిళనాడు వృద్ధిరేటు 8.79శాతం, బెంగళూరుతో కూడిన కర్ణాటక వృద్ధిరేటు 6.2 శాతం. ముంబైతో కూడిన మహారాష్ట్ర వృద్ధిరేటు 8 శాతం. చివరకు అహ్మదాబాద్‌తో కూడిన గుజరాత్‌ వృద్ధిరేటు కూడా  7.7 శాతమే. కానీ చంద్రబాబు ఆధ్వర్యంలో మన వృద్ధిరేటు 10.99 శాతం. వారెవ్వా.. ఈ ఘనత నిజంగా దేవరహస్యం.
 
జీఎస్‌డీపీలో సేవల రంగం వాటా 46శాతం. మిగిలిన వారికంటే మన రాష్ట్రం తక్కువుంది ఒక్క ఐటీ రంగంలోనే.. హైదరాబాద్‌లోనే ఐటీ రంగం 98శాతం ఉంది. గత మూడేళ్ల కాలంలో ఐటీ రంగానికి సంబంధించి చంద్రబాబునాయుడు గొప్పలు చెబుతున్నారు. సత్యనాదెళ్లకు తానే స్ఫూర్తి అంటారు. తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవో అయ్యాడంటారు. అమరావతిలో 11వ మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి కేంద్రం స్థాపించడానికి సత్యనాదెళ్ల అంగీకరించారని చంద్రబాబు చేసిన ప్రకటన అక్టోబర్‌ 21న కొన్ని పత్రికల్లో వచ్చింది. కానీ, ఆయన అలా చెప్పిన కొన్ని గంటల్లోనే సత్య నాదెళ్ల తాము రావడం లేదని, కంపెనీ పెట్టడం లేదని ప్రకటించారు.

ట్రంప్‌ పేరు చెబితే భారతీయులు భయపడినట్లు చంద్రబాబు పేరు చెబితే భారతీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా భయపడుతున్నాయి. ఎన్‌సీఏఈఆర్‌ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్‌ 1 ర్యాంకు ఇచ్చినందువల్లే ఆ సంస్థలు అలా వణికిపోతున్నాయి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడుతుండగానే అర్థాంతరంగా మైకును కట్‌ చేసిన స్పీకర్‌ సభను ఈ నెల(మార్చి) 13వరకు వాయిదా వేశారు.