ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (10:14 IST)

ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి స్వ‌యంగా వ‌చ్చి....దండ వేసి...

ఎవ‌రైనా ఏదైనా మంచి పని చేస్తే, వారిని అభినందించ‌డం ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డికి అల‌వాటు. అయితే, ఆయ‌నే స్వ‌యంగా ఒక హెడ్ కానిస్టేబుల్ వ‌ద్ద‌కు కాన్వాయితో స‌హా వ‌చ్చారు. ఆ హెడ్ కానిస్టేబుల్ మెడ‌లో దండ వేశారు. ఆయ‌న చేసిన మేలుకు అభినంద‌న‌లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు సమయస్ఫూర్తికి ప్రశంసల వ‌ర్షం కురిపించారు. 
 
విజయవాడకు చెందిన రుద్రవరపు శాంతి ప్రియ త‌న‌తో పాటు తన ఇద్దరు పిల్లల‌తో న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. ఆ స‌మ‌యంలో  కృష్ణా బ్యారేజ్ చెక్ పోస్ట్ దగ్గర విధులు నిర్వ‌ర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వ‌ర‌రావు స‌మ‌య స్ఫూర్తితో వెంట‌నే వారిని ర‌క్షించారు. అక్క‌డున్న మత్స్యకారుల సహాయంతో నాగేశ్వరరావు త‌ల్లి, బిడ్డ‌ల్ని కాపాడారు. 
 
ఈ విషయం మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి దృష్టికి రావడంతో, ఈ రోజు ఉదయం ఆయ‌న నేరుగా కృష్ణా బ్యారేజ్ చెక్ పోస్ట్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. అక్క‌డే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు దగ్గరికి స్వయంగా వచ్చి శాలువా పూలదండలతో సత్కరించి అభినందనలు తెలిపారు. 
 
స్వయంగా మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి గారు వచ్చి అభినందనలు తెలిపి ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉందని హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు చెపుతున్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డిఎస్.పి.  దుర్గాప్రసాద్, తాడేపల్లి సిఐ శేషగిరిరావు పాల్గొన్నారు.