సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (13:39 IST)

ఆ అధికారులకన్నా... అటెండర్లే మేలు... సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్

వైసీపీ నాయ‌కులు కార్పొరేషన్ ఎన్నికల్లో మరీ ఇంతలా దిగజారిపోవాలా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము వైసీపీకి లేద‌ని, ఎన్నికల అధికారుల తీరుపై ఆయ‌న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
 
 
మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆర్వోల వైఖరికి నిరసనగా నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ నాయకులు.బైఠాయించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, బీసీ జనార్దన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు. 
 
 
సోమిరెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్టాడుతూ, అధికారులు మరీ ఇంతగా దిగజారిపోవాలా..మీ కంటే అటెండర్లే మేలుగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘోరమైన వ్యవస్థను ఎప్పుడూ చూడలేద‌ని, నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసి గంటలు గడుస్తున్నా అభ్యర్థుల జాబితాను వెల్లడించలేరా అని ప్ర‌శ్నించారు. కలెక్టర్, కమిషనర్ తో మాట్లాడితే, కాసేపు కాసేపు అని సాగదీసుకుంటూ వస్తున్నార‌ని ఆరోపించారు. నిమిషాల వ్యవధిలో సిద్ధమయ్యే జాబితా కోసం ఆర్వోలుగా ఉన్న 14 మంది జిల్లా అధికారులు గంటలకు గంటలు ఎందుకు ఆలస్యం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.
 
 
టీడీపీ అభ్యర్థులకు ఆర్వోలు ఫోన్ చేసి, సంతకాలు చేయడానికి రమ్మని పిలుస్తారా? ఉప సంహరణల సమయంలో మా అభ్యర్థుల సంతకాలతో మీకేం పని? అస‌లు మా అభ్యర్థులను అలా పిలవడానికి ఆ అధికారులకు బుద్ధుందా? అని సోమిరెడ్డి ప్ర‌శ్నించారు. ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటూ బరితెగించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పద‌న్నారు. 
 
 
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నెల్లూరు నగరాన్ని నందవనంగా తీర్చిదిద్దామ‌ని, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో నెల్లూరును గాలికొదిలేశార‌ని విమ‌ర్శించారు. ఈ రోజు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక దౌర్జన్యాలు, కిడ్నాప్ లు చేయడంతో పాటు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అభ్యర్థులను పోటీ నుంచి తప్పిస్తారా అని ప్ర‌శ్నించారు.జరుగుతున్న అరాచకాలను గమనిస్తున్న నెల్లూరు నగర ప్రజలు, వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని అన్నారు.