మనీ మేక్స్ మనీ అన్నాడు.. రూ.20 కోట్లు కుచ్చుటోపీ.. ఎక్కడ?
సోషల్ మీడియాతో మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. వీటి కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా మనీ మేక్స్ మనీ (ఎంఎంఎం) పేరిట రూ.20 కోట్లు కొల్లగొట్టాడు. వాట్సాప్ ద్వారా వీడియోలు చూపిస్తూ.. తన ముఖం కనిపించకుండా అంతా చేశాడు. చివరికి రూ.20కోట్ల వరకు యువకులను ముంచేశాడు.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నంద్యాల, నూనెపల్లెకు చెందిన వెంకటకృష్ణ (28) రెండు వేల మంది వద్ద రూ.20 కోట్లు గుంజేశాడు. 2018 జూన్ ఐదో తేదీన ఎంఎంఎం పేరిట వాట్సాప్ గ్రూప్ ప్రారంభించాడు.
తాను చెప్పిన ఖాతాల్లో డబ్బులేస్తే.. అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తానని ప్రచారం చేశాడు. ఇతడి మాటలను నమ్మి ఎంతో మంది డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేశారు. తామంతా మోసపోయామని తెలుసుకున్న 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ ఇతని బాధితులు వందలాది మంది ఉన్నట్టు సమాచారం.