గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (09:00 IST)

ఏపీలో 10 లక్షల మందికి పైగా కోవిడ్ బాధితులకు ‘టెలికన్సల్టేషన్' సేవలు

కోవిడ్ మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ బాధితులకు గణనీయమైన సేవలందించింది. ఈ ఏడాది మే 1 నుండి ఈ కాల్ సెంటర్లో నమోదయిన 5,523 మంది వైద్యులు ఈ నెల 21వ తేదీ వరకూ దాదాపు 10 లక్షల మందికి పైగా కోవిడ్ బాధితులకు ఫోన్లో వైద్య సలహాలు, సూచనలు అందచేశారు.

ఇందులో 1,132 మంది స్పెషలిస్టు వైద్యులున్నారు. వీరందరి సమిష్టి కృషి ఫలితంగా ఈ నెల 21వ తేదీ నాటికి  పెద్ద ఎత్తున కన్సల్టేషన్ సేవలు లభించాయి. ఈ సేవలు పొందిన వారిలో 7.20 లక్షల మంది ఇంటి నుండి చికిత్స పొందుతున్న వారే కావటం విశేషం.

కోవిడ్ సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితులు కొనసాగిన నేపథ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే 104 కాల్ సెంటర్ ద్వారా వైద్యులు టెలికన్సల్టేషన్ సేవలను అందించారు. ఇందులో కోవిడ్ ప్రోటోకాల్ కు  సంబంధించిన వివిధ అంశాలపై వెబినార్లతో వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు, వైద్యులు తమ సేవలను సులభంగా అందించేందుకు వీలుగా వారికి 104 టెలికన్సల్టేషన్ మొబైల్ యాప్ ను  కూడా అందుబాటులో వుంచారు.

ఫలితంగా ఈ నెల 21వ తేదీ నాటికి వైద్యులతో  సంప్రదించి టెలికన్సల్టేషన్ సేవలు పొందిన వారి సంఖ్య 18,401కి చేరింది. వీరితో పాటు హోం ఐసోలేషన్లో వున్న 7,20,079 మంది, హోం క్వారంటైన్లో వున్న 1,18,284 మంది కూడా టెలికన్సల్టేషన్ సేవలందుకున్నారు. కాగా 15,004 కాల్స్ మాత్రం వివిధ కారణాలతో పెండింగ్ లో  వున్నట్లు అధికారులు తెలిపారు.

వీరితో పాటు వివిధ దశల ఫీవర్ సర్వేలలో గుర్తించిన రోగులతో పాటు 1,824 మంది చిన్నారులు కూడా ఈ సేవలందుకున్నారు. వీరిలో 11,562 మందికి వైద్య పరీక్షలకు సిఫార్సు చేయగా, 583 మందికి వైద్య పరీక్షలతో పాటు ఔషధాలను కూడా సిఫార్సు చేశారు. దాదాపు 7,03,686 మందికి హోం ఐసోలేషన్ సిఫార్సు చేయగా, 19,999 మందికి ఆస్పత్రుల్లో అడ్మిషన్ కు సిఫార్సు చేశారు.

12,514 మందిని కోవిడ్ క్రిటికల్ కేర్ సెంటర్లకు సిఫార్సు చేయగా 51,027 మందికి హోం క్వారంటైన్ సిఫార్సు చేశారు. రాష్ట్ర స్థాయిలో గన్నవరంలోని హెచ్సీఎల్ క్యాంపస్, మంగళగిరి ఎపిఐఐసి భవనంలో ఏర్పాటు చేసిన ఈ 104 కాల్ సెంటర్లలో 27 మంది వైద్యులతో పాటు మొత్తం 333 మంది మూడు  షిఫ్ట్ లలో  నిర్విరామంగా పనిచేస్తూ బాధితులకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ కాల్ సెంటర్ లకు వచ్చిన కాల్స్ అన్నింటికీ జిల్లా స్థాయిలోని కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాల సమన్వయంతో వైద్య సలహాలు, సూచనలు అందజేశారు. ఫలితంగా ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు మొత్తం 76,082 మందికి వైద్య పరీక్షల ఫలితాలందించారు. మరో 2,899 మంది ఈ ఫలితాల సమాచారం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్లకు మొత్తం 94,903 మందికి ఫోన్ల ద్వారా సూచనలు, అనుమతులు మంజూరు చేశారు.