శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (19:33 IST)

ఎంపీ కేశినేని నానిని అరెస్టు చేయబోయిన పోలీసులు...

హైడ్రామా మ‌ధ్య‌... కొండ‌పల్లి మున్సిపాలిటీ నుంచి పోలీసులు ఎంపీ కేశినేని నానిని, ఇత‌ర టీడీపీ కౌన్సిల‌ర్ల‌ను బ‌య‌ట‌కు తెచ్చారు. పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించ‌డంతో ఎంపీ నాని వెన‌క్కి త‌గ్గారు. అంత‌కు ముందు త‌మ పార్టీ స‌భ్యుల‌తో కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలోనే రాత్రంతా ఉంటామ‌ని ఎంపీ నోటీసు ఇచ్చారు. కానీ, అధికారులు, పోలీసులు దీనికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. పోలీసులు కొండపల్లి మున్సిపల్ కార్యాలయం చుట్టూ మోహ‌రించారు. చివ‌రికి ఎంపీ కేశినేని నాని వెన‌క్క త‌గ్గి , త‌మ టీడీపీ వార్డ్ కౌన్సిలర్ సభ్యులతో స‌హా బయటకు వచ్చారు. ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నిక అధికారి తీరు త‌మ‌కు అర్థం కావడం లేద‌ని, ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలీదు, ఫోన్ తీసుకుని బయటకి లోపలికి తిరుగుతున్నార‌ని ఆరోపించారు. 
 
 
కోర్టు ఆదేశాలు ఉన్నా, ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో తెలీదని, ఎప్పటికి వాయిదా పడింది అనేది కూడా తెలుపలేద‌ని చెప్పారు. రేపటికి వాయిదా వేస్తారా? లేక నిరవధికంగా వాయిదా వేస్తారా అనేది చూడాల‌న్నారు. ఉదయం నుండి ఉన్న మీడియా ఫుటేజీ తో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అని కేశినేని నాని చెప్పారు. వైసీపీ వర్గీయులు గొడవలు చేశార‌ని, భయాందోళనలు సృష్టించార‌ని, చివ‌రికి పోలీసులపైకి కూడా దాడులకు తెగబడ్డార‌ని చెప్పారు. అయినా కొండ‌ప‌ల్లి ఛైర్మ‌న్ ఎన్నిక అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఎక్కువ మాట్లాడను అని ముగించారు.