శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (19:00 IST)

హైకోర్డులో జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తుందనే, యూ టర్న్!

ఏపీలో మూడు రాజ‌ధానుల బిల్లును వైసీపీ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవడంలో చాలా డ్రామా ఉంద‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిపై హైకోర్టులో జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తుందనే సీఎం జగ‌న్ ఇలాంటి డ్రామాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

 
కడప జిల్లా నందలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, రాజ‌ధాని అంశంపై మాట్లాడారు. తాము వ‌రద ప్రభావిత ప్రాంతాలను సందర్శించామ‌ని, ఇక్క‌డ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యం కారణం అని చెప్పారు. వైసీపీ నేతలకు జ‌డిసి అధికారులు సరైన సమయంలో స్పందించలేద‌ని ఆరోపించారు. ఇసుక రీచ్ ల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన వైసీపీ నేత‌ల‌ను స్థానికులు తీవ్రంగా దూషిస్తున్నార‌ని చెప్పారు.

 
వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు చాలా నష్టపోయార‌ని, ఇలాంటి నష్టం గతంలో ఎప్పుడూ చూడలేద‌ని సోము వీర్రాజు చెప్పారు. నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని, చనిపోయిన వారికి 5 లక్షలు మాత్రమే సీఎం జగన్ కేటాయించార‌ని, అదే విశాఖలో మాత్రం కోటి రూపాయలు నష్టపరిహారం అందించార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. సీఎం గారూ, మీ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఇలాంటి అంతరం ఏమిటో అర్థం కావడం లేద‌ని, సర్వం కోల్పోయిన వారికి నష్టపరిహారం వెంటనే అందించాల‌ని డిమాండు చేశారు. క‌నీసం చెప్పిన మొత్తం అయినా, ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా వెంట‌నే అందించాల‌ని డిమాండు చేశారు. సీఎం జ‌గ‌న్ ఏరియల్ సర్వే చేయడం కాద‌ని, ప్ర‌తి గ్రామంలో పర్యటించాల‌న్నారు.ఇప్పటికే ప్రధాని మోదీ సీఎం జగన్ తో మాట్లాడార‌ని, కేంద్రం కూడా రాష్ట్రానికి వ‌ర‌ద స‌హాయం అందిస్తుంద‌ని బీజేపీ నేత‌లు చెప్పారు.
 
 
ఇక అమ‌రావ‌తి విష‌యంలో సీఎం జ‌గ‌న్ ముందు చూపుతో నిర్ణ‌యం తీసుకున్నార‌ని, మూడు రాజధానుల విషయంలో న్యాయస్థానం నుంచి తప్పించుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అన్నారు. మొద‌ట్లో సీఎం అమరావతిని ఇక్కడే నిర్మిస్తామని చెప్పార‌ని, కానీ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నార‌ని, కోర్టులో జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తుందనే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నార‌ని అన్నారు.


అధికార వికేంద్రీకరణ ఒకరి సోత్తేమి కాద‌ని, అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి అంటూ, రాయలసీమలో అభివృద్ధి చేయడం లేద‌ని సీఎంని సోమువీర్రాజు త‌ప్పుప‌ట్టారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింద‌ని, రాష్ట్రంలో ఓట్లు వేసినా వేయకపోయినా కేంద్రం అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. అధికార వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేద‌ని సోము వీర్రాజు చెప్పారు.