మా తమ్ముడు పార్టీ పెట్టడం మా ఫ్యామిలీకి ఇష్టంలేదు : నాగబాబు

Last Updated: మంగళవారం, 30 జులై 2019 (17:42 IST)
తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం మాకెవ్వరికీ ఇష్టంలేదనీ సినీ నటుడు నాగబాబు అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌తో కలిసి ఆయన మంగళవారం విజయవాడలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు.

ఆ తర్వాత నాగబాబు మాట్లాడుతూ, ఐదేళ్ళ క్రితం నా తమ్ముడు పవన్ పార్టీ పెట్టడం మాకెవ్వరికీ ఇష్టంలేదన్నారు. ముఖ్యంగా, మా కుటుంబంలో ఏ ఒక్కరికీ ఎంతమాత్రం ఇష్టంలేదు. అప్పటికే మా అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంత నష్టపోయారో మాకు తెలుసనీ, అలాంటపుడు తమ్ముడు కూడా జనసేన పార్టీని స్థాపించడాన్ని మా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ కూడా స్వాగతించలేక పోయారన్నారు. ఎందుకంటే.. పవన్ అంతలా ఎందుకు కష్టపడాలన్న భావన మాలో ఉండేదన్నారు.

కానీ పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆదర్శాలు తెలిసి పార్టీలోకి వచ్చినట్టు నాగబాబు వెల్లడించారు. తాను జనసేన పార్టీలో అందరికంటే జూనియర్ అని, పవన్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని అర్థం చేసుకోవడానికి రెండున్నరేళ్ల సమయం పట్టిందన్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలో తాను గోవాలో షూటింగ్‌లో ఉన్నానని చెప్పారు. అయితే, రెండున్నర గంటల విరామం తీసుకుని పవన్ ప్రసంగం విన్నానని చెప్పారు. ఆ ప్రసంగం విన్న తర్వాతే పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అర్థమైందని నాగబాబు చెప్పుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :